Vijayawada Corporation: ఖాళీ స్థలాల వివరాలు తెలియని విజయవాడ కార్పొరేషన్
నగరవాసుల పారిశుద్ధ్య సమస్యలతో బయట పడ్డ నిజాలు;
నగరంలో ఏదైనా వివరాలు కావాలంటే ముందుగా వెళ్లేది నగరపాలక సంస్థకే.... కానీ రాష్ట్రంలో అతిపెద్ద నగరాల్లో రెండో స్థానంలో ఉన్న విజయవాడ కార్పొరేషన్‌లో మాత్రం ఆ వివరాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఖాళీ స్థలాలు గుర్తించి వాటిపై పన్నులు వసూలు చేయడంలో... అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ స్థలాల్లో మురుగు, వర్షపు నీరు చేరి.... పిచ్చి మెుక్కలు పెరిగి... చుట్టుపక్కల ఆవాసాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థల యజమానులకు కనీసం నోటీసులు ఇవ్వడానికి కూడా వివరాలు లేకనే ఈ దుస్థితి వచ్చిందని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
విజయవాడలో ఖాళీ స్థలాల వివరాలు నగరపాలక సంస్థలో లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి... పన్నులు వసూలు చేయాల్సిన పాలక మండలి ఆ పని చేయడం లేదు. ఖాళీ స్థలాలు పల్లంగా ఉండడంతో పిచ్చిమెుక్కలు పెరిగి, వర్షపు, మురుగు నీరు చేరి.. చుట్టుపక్కల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ స్థల యజమానులకు నోటీసులు పంపి వాటని శుభ్రం చేయమని చెప్పడానికి కూడా V.M.C. దగ్గర వివరాలు లేవని నగరవాసులు అంటున్నార. అధికారుల నిర్లక్ష్యం, పాలక మండలి చేతకానితనం వల్లే నగరవాసులు అవస్థలు పడుతున్నారని ట్యాక్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఓ ఇంటికి ఆస్తి పన్ను చెల్లించకపోతే జప్తు నోటీసు పంపే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంది. కానీ ఖాళీ స్థలాల పన్ను చెల్లిస్తున్నారా.. లేదా.. అని అడగటానికి కూడా కార్పొరేషన్ వద్ద వివరాలు లేవు. స్థలం, ఇంటి రిజిస్ట్రేషన్ వివరాలు, యజమానుల పేర్లు స్థానిక సంస్థలో నమోదు చేయకపోవడం లాంటి అంశాలు.... ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమని ట్యాక్స్ అసోసియన్ నాయకులు చెబుతున్నారు.