విశాఖపట్నం మరో అరుదైన ఘనతను సాధించింది. మహిళలకు దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ వార్షిక నివేదిక ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 31 ప్రధాన నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ గురువారం ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సర్వేలో దేశవ్యాప్త భద్రతా స్కోరు 65 శాతంగా నమోదు కాగా, విశాఖపట్నం పనితీరు జాతీయ సగటు కంటే ఎంతో మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వైజాగ్‌తో పాటు భువనేశ్వర్, కోహిమా, ఐజ్వాల్, ఈటానగర్, ముంబై, గాంగ్‌టక్ వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ గుర్తింపుపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చ హర్షం వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం తాము తీసుకుంటున్న నిరంతర చర్యలకు ఈ ర్యాంకు నిదర్శనమని అన్నారు. "నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్, డ్రోన్ల నిఘా, కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక షీ టీమ్స్ వంటి అనేక చర్యలు తీసుకుంటున్నాం" అని ఆయన వివరించారు. అంతేకాకుండా, ఏ మహిళకైనా పోలీస్ స్టేషన్ స్థాయిలో న్యాయం జరగకపోతే, వారు నేరుగా తనను సంప్రదించవచ్చని కమిషనర్ భరోసా ఇచ్చారు. "బాధితులు ఎప్పుడైనా నా మొబైల్ ఫోన్‌కు కాల్ చేయవచ్చు లేదా అర్ధరాత్రి వరకు ఆఫీస్‌లో నన్ను నేరుగా కలవవచ్చు" అని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ నివేదికలో ఢిల్లీ, కోల్‌కతా, పట్నా, శ్రీనగర్, జైపూర్ వంటి నగరాలు మహిళల భద్రతలో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. అక్కడి మౌలిక సదుపాయాల కొరత, సంస్థాగత వైఫల్యాలే ఇందుకు కారణంగా నివేదిక పేర్కొంది.