Vizianagaram: ఆలయ ధర్మకర్తను కూడా పట్టించుకోరా?: టీడీపీ
Vizianagaram: విజయనగరం జిల్లాలోని రామతీర్థ క్షేత్రం ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచింది.;
Vizianagaram: విజయనగరం జిల్లాలోని రామతీర్థ క్షేత్రం ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచింది. రామతీర్థం సమీపంలోని బోడికొండపై కోదండరాముడి ఆలయం ఉంది. దాదాపు 400 ఏళ్ల కిందట పూసపాటి వంశీయులు నిర్మించిన ఈ ఆలయ పునర్ నిర్మాణం శంకుస్థాపన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆలయాన్ని తమ పూర్వీకులు కట్టించారని ఇక్కడ ప్రభుత్వ శిలాఫలాకాలు ఏంటని నిలదీసిన అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు.. వాటిని పెకిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.
అశోక్ గజపతిరాజుపై చేయివేసి తోసేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన బోడికొండపై ఉన్న కోదండ రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై అప్పట్లోనే ఏపీ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ధ్వంసమైన రాముడి విగ్రహ స్థానంలో కొత్త ప్రతిమల్ని ప్రతిష్టించేందుకు వాటిని TTD శిల్పులతో తయారు చేయించారు.
బోడికొండకు చేరుకునే మెట్ల మార్గం, కోనేరు, ధ్వజస్తంభం, గర్భాలయం, ఆలయ ప్రాకారం పునర్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజును కావాలనే విస్మరించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్‌జగపతిరాజును టార్గెట్ చేస్తున్న వైసీపీ.. ఆలయ పునర్ నిర్మాణంలోనూ అతని పాత్ర లేకుండా చేసే కుట్రకు దిగింది.
ఆలయ పునర్ నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అశోక్ గజపతి రాజుతో వాగ్వాదానికి దిగారు. ఇదేమీ సర్కస్ కాదని, ట్రస్ట్ చేయలేకపోతేనే తాము చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఐతే.. ట్రస్ట్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం ఏంటని అశోక్ గజపతిరాజు ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.
ఈ ఉద్రిక్తల మధ్యే భూమి పూజ పూర్తి చేశారు మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణ. శంకుస్థాపన జరుగుతున్న సమయంలో తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్‌గజపతిరాజు అసహనం వ్యక్తం చేయడమే గాక అందోళనకు దిగారు. ఇదే సమయంలో శిలాఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు.
ఆలయ మర్యాదలు పాటించకుండా అధికారులు, మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై అశోక్ గజపతిరాజు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కానే కాదని, తమ పూర్వికులు 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయమని గుర్తు చేశారు. ఇలాంటి చోట ఆనవాయితీల్ని వదిలేసి హడావుడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
గతంలోనే ఆలయ పునర్ నిర్మాణ పనుల కోసం తాను ఇచ్చిన చెక్‌ను కూడా తీసుకోలేదని, ఇప్పుడు కావాలని ఇంకా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయ మర్యాదలు, సంప్రదాయాల ప్రకారం కార్యక్రమం జరగడం లేదని ప్రశ్నించడం తప్పా అని అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. ఈ దేశంలో న్యాయం ఉందా అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనువంశిక ధర్మకర్తగా ఉన్న తమ కుటుంబాన్ని పక్కకుపెట్టేలా ప్రభుత్వం వ్యవహరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పూర్వీకులు కట్టించిన ఆలయానికి మరమ్మతుల పేరు చెప్పి ప్రభుత్వ శిలాఫలకాల్లాంటివి ఎందుకుని ప్రశ్నించారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే పలు ఆలయాలపై దాడులు జరిగాయని, వాటిపై దర్యాప్తు ఏమైందని నిలదీశారు.
రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందని, వీధిరౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే.. దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని దుయ్యబట్టారు. వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అశోక్ గజపతిరాజుపై కక్షకట్టారని, మాన్సాన్ ట్రస్టు ఛైర్మన్‌గా తొలగించి భూములు కాజేయాలని చూశారని ఆరోపించారు. రామతీర్థంలో విగ్రహ ధ్వంసం జరిగి ఏడాదైనా నిందుతులను పట్టుకోకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇతరతమ బేధాలు లేకుండా ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్న వైసీపీ తీరుపై విజయనగరం ప్రజలు మండిపడుతున్నారు. శతాబ్దాల సంప్రదాయాలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.