రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వైసీపీని వీడబోతున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు సీనియర్ నేతలు అదే బాటలో పయనించబోతున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బడా పారిశ్రామికవేత్తగా పేరుతెచ్చుకున్న రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామి రెడ్డి కూడా పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభకు రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి మరో వారంరోజుల్లో రాష్ట్రానికి చేరుకుని తన రాజీనామాపై అధికారిక ప్రకటన చేస్తారని కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయోధ్య రామిరెడ్డి ఖండించారు. తాను పార్టీని వీడబోతున్నట్టు జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రకటన చేశారు. మరోవైపు మాజీ మంత్రి, జగన్ కు నమ్మినబంటు కొడాలి నాని కూడా వైకాపాకు రాజీనామా చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ దిశగా ఆయన పేరుతో ట్విట్టర్లో ప్రకటనలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రకటనలు వచ్చిన గంటల వ్యవధిలోనే ఫేక్ ట్విట్టర్ అని, వాటిని ఎవరూ నమ్మవద్దంటూ వైకాపా వర్గాలు ప్రకటించాయి.