Sri J.Shyamala Rao : టిటిడిలో పనిచేయడం ఎన్నోజన్మల పుణ్యఫలం : శ్యామల రావు

Update: 2025-09-10 10:24 GMT

టిటిడిలో పనిచేయడం ఎన్నోజన్మల పుణ్యఫలం : శ్యామల రావు

టిటిడిలో పని చేయడం ఎన్నోజన్మల పుణ్యఫలమని టిటిడి నుండి బదిలీపై వెళ్తున్న ఈవో శ్రీ జె. శ్యామల రావు తెలిపారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయనకు సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జె. శ్యామల రావు మాట్లాడుతూ, తన కాలంలో చాలా దూరదృష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. టిటిడి అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తనకు నిత్యం పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు. భక్తుల నుండి అభిప్రాయ సేకరణ స్వయంగా చేపట్టి, లోపాలను సవరించుకుంటూ, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఉద్యోగుల సహకారం మరువలేనిదన్నారు. వచ్చే 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతగా ఉండేలా పటిష్ట వ్యవస్థలను తీసుకువచ్చామన్నారు. ఉద్యోగుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్ లకు టిటిడి ఈవోగా పనిచేయాలని ఉంటుందని, తాను కూడా ఈవోగా పనిచేయాలనే కోరిక ఉండేదని, అనుకోకుండా ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తనకు అవకాశం ఇచ్చారని, ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, తనకు సహకరించిన టిటిడి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News