వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల అధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ తన ఇంటి గేటు దగ్గర సిబ్బందికే రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అయినా కొన్ని నేరాలు జరుగుతుండటంతో బాధగా ఉంది. శిక్షలు అమలు చేసేందుకు ప్రత్యేక కోర్టులు కావాలి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆమె హెచ్చరించారు.
సోమవారం ఉదయం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు.. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. మమ్మల్ని విమర్శించే నాయకులందరికీ నేను ఈ రోజు చెబుతున్నా. ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి. హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది.. గుర్తుపెట్టుకోండి.’ అని పవన్ పేర్కొన్నారు.