అర్చకుడిపై దాడి చేసిన వైసీపీ నేత కోడే యుగంధర్‌

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం.. పంచారామ క్షేత్రం స్వామేశ్వర ఆలయంలో ఘటన

Update: 2023-08-10 07:20 GMT

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి వ్యవహారం వివాదాస్పదమైంది. ఆలయ సహాయ అర్చకులు పవన్‌శర్మ స్వామిని దర్శించుకునే ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో దేవస్థానం పాలకమండలి ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి భర్త, వైసీపీ నేత కోడే యుగంధర్‌ అడ్డుగా ఉండటంతో ఆయన్ను‘పక్కకు తప్పుకోండని అడిగారు. దీంతో ఆగ్రహానికి గురైన యుగంధర్‌ అర్చకుడిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితు అర్చకులు పవన్ శర్మ. అర్చకుడిపై దాడిని ఖండిస్తూ గునుపూడి ఉమామహేశ్వర బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడటంతోపాటు పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచిన వ్యక్తి క్షమాపణలు చెప్పాలంటూ నిరసన తెలిపారు. అనంతరం వారు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను కలిసి విన్నపమిచ్చారు.

Full View 

ఈ దాడిని ఖండిస్తూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు. అటు బ్రాహ్మణ సమాఖ్య ఆందోళనతో భీమవరంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేవాదాయశాఖ ఆర్జేసీ విచారణ, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ జోక్యంతో దేవస్థానం పాలకమండలి ఛైర్‌పర్సన్‌ రాజీనామా చేశారు. కాకినాడ నుంచి దేవాదాయశాఖ ఆర్జేసీ ఎం.సురేష్‌ ఆలయానికి వచ్చి వివరాలు సేకరించారు. వారి సమక్షంలోనే ఆలయ పాలకమండలి ఛైర్‌పర్సన్‌ కోడే విజయలక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు. సున్నితమైన వ్యవహారం కావటంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఆమెతో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News