YCP: రాజ్యసభలో మరింత తగ్గనున్న వైసీపీ బలం
ఎనిమిది నుంచి ఆరుకు తగ్గనున్న బలం..!.. ఈ రెండు స్థానాలు కూటమి ఖాతాలోకే;
రాజ్యసభలో వైసీపీ బలం మరింత తగ్గనుంది. 2024లో ఎన్నికల సమయంలో రాజ్యసభలో జగన్ పార్టీకి 11 మంది ఎంపీల బలం ఉంది. ఆ తర్వాత ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆ బలం ఎనిమిదికి తగ్గింది. తాజాగా విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పడిపోనుంది. మరోవైపు కూటమి బలం మరింత పెరగనుంది.
కేసుల భయంతోనేనా..!
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం.. కలకలం రేపుతోంది. ముంచుకొస్తున్న కేసుల భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ పిలిచి ప్రశ్నించింది. అరబిందో శరత్ రెడ్డి ముందు పెట్టి ఆయన అనేక ఆర్థిక పరమైన అవకతవకలు చేశారని వాటిపై విచారణలు జరుగుతున్నాయని చెబుతున్నారు. వైసీపీ ఆర్థిక లావాదేవీలన్నీ విజయసాయే చూసేవారు.
జగన్ స్పందిస్తారా?
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముందు నుంచి వైసీపీలో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి.. జగన్‌కు ఎంతో అండగా ఉన్నారు. అటు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. జగన్ విదేశీ పర్యటనలో ఉండగా ఊహించని విధంగా ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
కూటమి ఖాతాలోకే మరో రెండు ఎంపీ సీట్లు
వైసీపీకి మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో... ఈ రెండు ఎంపీ సీట్లు కూటమి ఖాతాల్లోకే చేరనున్నాయి. ఇప్పటికే ఇద్దరు వైసీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయగా.. తాజాగా విజయసాయి, అయోధ్య రామిరెడ్డి గుడ్ బై చెప్పనున్నారు. విజయసాయి రాజ్యసభ పదవీ కాలం జూన్ 21, 2028 వరకు ఉన్నా ఆయన రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసిన ఈ రెండు స్థానాలు కూడా కూటమకి దక్కనున్నాయి.