YCP: ఏపీకి పెట్టుబడులు రాకుండా.. వైసీపీ కుట్రలు
వైసీపీ కుట్రలపై విచారణ చేయిస్తాం.. జగన్ కుట్రలను తిప్పకొట్టాలన్న సీఎం;
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలపై విచారణ చేయిస్తామని ప్రకటించారు. చేసిన తప్పులను ప్రత్యర్థులపైకి నెట్టేసే కుట్రలను వైసీపీ ఇంకా అమలు చేస్తుందని.. నిధులు రాకుండా తెరవెనుక అడ్డుకోవడం వారికి అలవాటుగా మారిందని ఆరోపించారు. పథకాలు ఇవ్వడం లేదంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోసోల్కి భూములు ఇవ్వొద్దని రైతుల్ని రెచ్చగొట్టించింది జగనేనని ఆక్షేపించారు. మరోవైపు ఆయన పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ సొంత మీడియాలో రాయిస్తున్నట్లు మండిపడ్డారు. జగన్ కుట్రల్ని ఎక్కడికక్కడ సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం మంత్రులకు సూచించారు.
200 కంపెనీలకు వైసీపీ ఈ మెయిల్
ఏపీ ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు మెయిళ్లు పెట్టడాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. పెట్టుబడులను అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 కంపెనీలకు ఈ-మెయిళ్లు పెట్టారని తెలిపారు. వైసీపీ కుట్రలపై విచారణకు ఆదేశిస్తామని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి.. వారు ఒప్పుకున్నాకే భూ సమీకరణ చేయాలని తమకు సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందకుండా ప్రతిపక్షం చేస్తోన్న కుట్రలు తిప్పి కొట్టాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు అన్నారు. ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని ఈ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తమకు స్పష్టంగా ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి సమావేశం ముగిసిన అనంతరం వివరించారు. వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని దీంతో పెట్టుబడులు పెట్టేవారు రాకుండా చూడాలన్నదే వారి ప్రధాన ఉద్దేశం గా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. 200 ఈ-మెయిళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ఇటువంటి అసత్య ప్రచారాలను మానుకోవాలని రాష్ట్ర అభివృద్ధి చెందేందుకు కుదిరితే కలిసి పని చేయాలని లేకపోతే మౌనంగా ఉండాలని సీరియస్ గా వ్యాఖ్యానించారు.
మంత్రివర్గం కీలక నిర్ణయాలు
అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారుల భవనాలను సత్వరం పూర్తి చేయాలని ఏపీ మంత్రివర్గం తీర్మానించినట్లు కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కొలుసు పార్థసారధి వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల నివాస భవనాలు పూర్తి చేయడం కోసం నిధుల మంజూరుకు సైతం ఈ కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. భవనాలు మిగిలిన పనుల పూర్తి చేసేందుకు రూ. 524.7 కోట్లు నిధుల మంజూరుకు పరిపాలన పరమైన ఆమోదం చెప్పినట్లు పేర్కొన్నారు. అమరావతిలో 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 33.49 ఎకరాలు భూములు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు 32. 4 ఎకరాలు భూమి కేటాయిస్తూ ఆమోదం తెలిపామని పేర్కొన్నారు. అలాగే గెయిల్, అంబికా సంస్థలకు అమరావతిలో కేటాయించిన భూమిని రద్దు ప్రతిపాదనకు ఆమోదం తెలిపామన్నారు. ఇక కృష్ణానదీలో ప్రకాశం బ్యారేజీ ముందు ఇసుక క్వారీయింగ్ కోసం రూ. 250.2 కోట్లు పరిపాలన పరంగా ఆమోదించామని చెప్పారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి క్వారీయింగ్‌ను ఏపీ సీఆర్డీఏ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. జల వనరుల శాఖలో గత ప్రభుత్వం పక్కన పెట్టిన 71 పనులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించిందన్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో విమానాశ్రయాల అభివృద్దికి రూ. 1000 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఎయిర్‌పోర్టులు లీజుకు ఇవ్వడం.. పీపీపీ ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ అప్పులు చెల్లించాలని నిర్ణయించామని చెప్పారు. రామాయపట్నంలో భూ సేకరణ కోసం ఐదు టీమ్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 1,575 పింఛన్లను పునరుద్దరించాలని నిర్ణయించామన్నారు. మార్క్‌ఫెడ్ తీసుకున్నరూ. 6, 700 కోట్లు రుణానికి అదనంగా రూ. 1000 కోట్లు రుణం పొందేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కొనుగోలు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రైతులకు ధాన్యం సేకరణ నగదు చెల్లించేందుకు రూ. 672 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపామన్నారు. రైతుల ఖాతాలో ధాన్యం కొనుగోలు నగదు జమ చేయాలని నిర్ణయించిందని చెప్పారు. అమరావతి క్వాంటం వ్యాలీ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీ అభివృద్ది కోసం ప్రకటించిన పాలసీకి పచ్చ జెండా ఊపినట్లు తెలిపారు