AP: జగన్-షర్మిల రాజీ చర్చలు..!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు... ఆస్తుల పంపకాలకు జగన్ ఓకే..!;
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజీ చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణమని వైసీపీ కోసం ప్రచారం చేసిన షర్మిల తర్వాత సొంత రాజకీయం ప్రారంభించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణంగా నిలిచింది. దీంతో జగన్ రాజీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో వ్యతిరేక ప్రచారం
వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో వైఎస్ జగన్ మొట్టమొదటగా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలనే అభిప్రాయం తెరపైకి వచ్చింది. కారణాలు ఏవైనా జగన్ చెల్లెళ్లు షర్మిల, డాక్టర్ సునీత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేశారు. వీళ్లిద్దరి ప్రచారం జగన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొచ్చిందన్నది వాస్తవం. అంతేకాదు, కడప ఎంపీగా పోటీ చేసిన తన బిడ్డ షర్మిలను ఆదరించాలని వైఎస్ విజయమ్మ ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు. కుటుంబంలోనే తీవ్రస్థాయిలో విభేదాలుంటే, ఇక బయట సమాజం ఏ విధంగా ఆదరిస్తుందనే ప్రశ్న ఉత్పన్నమైంది. షర్మిలతో ఏవైనా సమస్యలుంటే జగన్ పరిష్కరించుకోవాలనే సూచనలొచ్చాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత బహుశా జగన్ ఆ పనిమీదే ఉన్నట్టున్నారు.
ఆస్తి పంపకాలకు ఓకే
జగన్‌కు, షర్మిలకు మధ్య గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఆస్తిలో షర్మిలకు ఏమీ ఇచ్చేది లేదని అనుకున్న జగన్.. ఇప్పుడు ఆస్తి పంపకాలకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరులోనే వీటికి సంబంధించిన చర్చలు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఒంటరిగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న జగన్.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను కలుపుకొని పోయే యోచనలో ఉన్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి.
బీజేపీకి జగన్ దత్తపుత్రుడు: షర్మిల
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అప్పటి జగన్ ప్రభుత్వం నీరుగార్చిందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ‘మతాలకు అనుకూలంగా ఉండే BJPని వైఎస్‌ఆర్ వ్యతిరేకిస్తే.. జగన్ మాత్రం అదే పార్టీకి దత్తపుత్రుడిగా మారారు. ఆయన ఆశయాలకు జగన్ వారసుడు అవుతారని అనుకోవడం పొరపాటే. వైసీపీ మహా పాపం చేసింది’ అని షర్మిల మండిపడ్డారు.