సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఎక్స్ వేదికగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు పథకాల అమలుకు డబ్బులు లేవనటం దారుణమన్నారు. పథకాలు అమలు చేయమని అడిగితే రాష్ట్ర ఆదాయం పెంచాలని సూక్తులు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు హామీలు ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక భారం కనపడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లు వుందన్నారు. రాష్ట్రంలో పథకాలు అమలు చేసేందుకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే..బీజేపీకి ఇచ్చిన మద్దతును చంద్రబాబు ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.