SHARMILA: నా ప్రచారంతో వైసీపీ వణికిపోతోంది
వివేకానంద రెడ్డి హంతకులను జగన్ కాపాడుతున్నారన్న షర్మిల.. జగన్ హత్యా రాజకీయాలు భరించలేకే ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటన..;
సీఎం జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని... వివేకానంద రెడ్డి హంతకులను కాపాడుతున్నారని ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. జగన్ హత్యా రాజకీయాలను భరించలేకనే.. తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని... స్పష్టం చేశారు. ఎన్నికల్లో న్యాయం వైపు నిలబడతారో..? అన్యాయానికి అండగా ఉంటారో ప్రజలు తేల్చకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో జోరుపెంచారు. పులివెందులలోని వివేకా ఘాట్ వద్ద సునీతతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ముద్దనూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల, సునీత పాల్గొన్నారు. వివేకా హత్య విషయంలో తన న్యాయ పోరాటానికి షర్మిల మద్దతు తెలిపారని సునీత అన్నారు. అందుకే షర్మిల గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని జగన్ గెలిపిస్తే ఆయన హత్యా రాజకీయాలు చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు.
ముద్దనూరు సభలో ప్రసంగం తర్వాత షర్మిల జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లిలోని స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లడిన షర్మిల... స్టీల్ ప్లాంట్ నిర్మాణం, రాజధాని, పోలవరం సాధించాలంటే కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు. ఈ జిల్లాలో నా ప్రచారంతో వైకాపాలో వణుకు పుడుతోంది. అవినాష్ హంతకుడని ప్రజలు నమ్ముతున్నారు. ఆయనకు సంబంధించి సీబీఐ అన్ని ఆధారాలు బయటపెట్టింది. అయినా ఎలాంటి చర్యలు లేవు. అతడిని జగన్ కాపాడుతున్నారు. సొంత బాబాయ్‌ని చంపిన వాళ్లకి మళ్లీ సీట్ ఎందుకు ఇచ్చారు? ప్రజలు నిజాలు తెలుసుకున్నారని ఆయన్ను మార్చాలని చూస్తున్నారు. అవినాష్ ఓడిపోతారని తెలిసే మారుస్తున్నారా? హత్యా రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలి. ఈ అన్యాయాన్ని ఎదురించేందుకే ఎంపీగా పోటీ చేస్తున్నా. వైఎస్ బిడ్డ కావాలో.. హంతకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలి’’ అని షర్మిల అన్నారు.