Tirumala Laddu : తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కట్టు కథ అన్న జగన్
తప్పు చేసి కూడా చంద్రబాబుపై ఏడుపు;
‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన 100 రోజుల పాలన వైఫల్యంపై ప్రజలు ప్రశ్నించకుండా వారి దృష్టి మరల్చేందుకే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ దుష్ప్రచారంతో డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు’ అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. ‘తిరుమల పవిత్రత, వేంకటేశ్వరస్వామి గొప్పతనాన్ని, రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారు, ఇది ధర్మమేనా?’ అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు
‘జులై 12న నమూనాలు తీసుకున్నారు. వాటిని పరీక్షిస్తే సరిగా తేలలేదని, జులై 17న ఎన్‌డీడీబీకి వాటిని పంపారు. వాటిపై ఆ సంస్థ జులై 23న నివేదిక ఇచ్చింది. కానీ 2 నెలల తర్వాత.. ఇప్పుడు బయటకు తీసి తెదేపా కార్యాలయంలో విడుదల చేశారు’ అని ఆరోపించారు.
‘నెయ్యి సరఫరా కొత్తగా జరుగుతున్నది కాదు. ప్రతీ ఆర్నెల్లకు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తారు, ఎల్-1గా వచ్చినవారిని బోర్డు ఆమోదిస్తుంది. నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. ట్యాంకర్ తెచ్చేటప్పుడు ఎన్‌ఏబీఎల్ (నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రొడక్ట్ సర్టిఫై ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలి. తితిదేలోనూ మూడు శాంపిల్స్ తీసుకుని, వాటిని పరీక్షిస్తారు. వాటిలో ఏ ఒక్క దాంట్లో పాస్ కాకపోయినా వాహనాన్నే తిప్పి పంపుతారు. అలాంటి గొప్ప వ్యవస్థ తితిదేలో ఉన్నందుకు సంతోషపడాలి, గర్వంగా ప్రపంచానికి చాటుకోవాలి. కానీ, ఇలా అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తారా?’ అని అన్నారు.
‘మన ఖర్మ ఏంటంటే.. భాజపా వారికి సగం తెలుసు, సగం తెలియదు. తితిదే బోర్డులో భాజపాలోని సీనియర్లు సభ్యులుగా చేశారు. ఈ ప్రొసీజర్లు వారికి తెలియవా? తెలియకపోతే తెలుసుకోమనండి. భాజపా వారు నిజంగానే హిందువులకు నిజాయతీగా ప్రాతినిధ్యం వహించేవారైతే ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం ధర్మమేనా అని చంద్రబాబుకు గట్టిగా అక్షింతలు వేయాలి. ఆ ధైర్యం భాజపాకు ఉందా?’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా జగన్ చెప్పారు. ‘రాజకీయ యావతో వేంకటేశ్వర స్వామి, తితిదే ప్రతిష్ఠకు చంద్రబాబు భంగం కలిగిస్తున్నారని, ఆయనకు అక్షింతలు పడాలని కోరుతూ ప్రధానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాస్తా’ అని వెల్లడించారు.