సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి
సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు;
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సీబీఐ విచారణకు హాజరయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. హత్య కేసులో షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ ను అవినాష్ రెడ్డికి మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. జూన్ నెల చివరి వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే సీబీఐ ముందుకు ఈ రోజు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. ముందస్తు బెయిల్ పొందిన తరువాత మూడో సారి విచారణకు హాజరయ్యారు.
అవినాష్ కు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఇప్పటికే సునీత సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి సునీత తరఫు న్యాయవాది సాయం చేయడానికి సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది. ఈమేరకు సునీత తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు అనుమతించింది. దీంతో సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీబీఐ కోర్టు సునీతకు స్పష్టం చేసింది.