లోకేష్ యువగళ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇవాల్టితో పాదయాత్ర 144 వ రోజుకు చేరింది. ఇప్పటివరకు 1884 కిలోమీటర్లు నడిచారు లోకేష్. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేష్. ఇవాళ కాకుపల్లి క్యాంప్ సైట్ నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ధనలక్ష్మీపురంలో స్థానికులతో మాటామంతీ నిర్వహిస్తారు. అనంతరం గుండ్లపాలెంలో ప్రజలతో సమావేశమవుతారు. ఆ తర్వాత వడ్డెపాలెం – నారాయణ మెడికల్ కాలేజీ జంక్షన్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. సాయంత్రం పార్థసారధి నగర్ లో స్థానికులతో సమావేశమైన వారి సమస్యలు తెలుసుకుంటారు. ఆకుతోట జంక్షన్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమవుతారు. అపోలో హాస్పిటల్ జంక్షన్ లోనూ, హరనాథపురంలో ప్రజలతో సమావేశమవుతారు. ఇవాళ రాత్రి అనిల్ గార్డెన్స్ విడిది కేంద్రంలో బస చేస్తారు.
యువగళం దెబ్బకి జగన్‌కు దిమ్మతిరిగిందన్నారు లోకేష్. పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు బహిరంగ సభలో వైసీపీపై ఆయన ఫైరయ్యారు. యువగళాన్ని ఎటాక్ చెయ్యాలని మంత్రులను, మాజీ మంత్రులను రంగంలోకి దింపారన్నారు. యువగళం బొమ్మ బ్లాక్ బస్టర్‌తో వైసీపీకి మింగుడు పడటం లేదన్నారు. భయం తమ బయోడేటాలో లేదని.. బాంబులకే భయపడని బ్లడ్ తమదన్నారు. యువగళంతో వైసీపీకి ఎండ్ కార్డ్ పడబోతోందన్నారు.
చంద్రబాబు అంటే బ్రాండ్.. జగన్ అంటే జైలు అని లోకేష్ విమర్శించారు. చంద్రబాబును చూస్తే కియా గుర్తొస్తుందని.. జగన్‌ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. జగన్‌కు రెండు బటన్స్ ఉంటాయని.. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్‌లో 10 రూపాయలు పడుతుందన్నారు. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి వంద రూపాయలు పోతుందని అన్నారు. వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం జగనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.