తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. నెయ్యి కాని నెయ్యిని తీసుకొచ్చి కోట్లాది మంది హిందూ భక్తులతో తినిపించిన పాపం వైసీపీ మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయానికి సరఫరా చేసే నెయ్యితో పాటు ఇతర కీలక వస్తువులన్నింటికీ ఇక నుంచి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ తప్పనిసరి చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త మాన్యువల్‌ను అమల్లోకి తీసుకువస్తున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు గారు తెలిపారు. నాణ్యతపై పూర్తి స్థాయి భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఆలయ అవసరాల కోసం కొనుగోలు చేసే ప్రతి వస్తువూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే టీటీడీకి చేరేలా విధివిధానాలు రూపొందించామని వెల్లడించారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న కొనుగోలు ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని టీటీడీ బోర్డు భావిస్తోంది. గత విధానాల వల్ల నాణ్యతపై పూర్తి స్థాయి నియంత్రణ సాధ్యపడలేదని, అందుకే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నామంటోంది బోర్డు. ఇకపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల ఆహార, ఇతర వస్తువుల కొనుగోళ్లు జరగనున్నాయి. నెయ్యి మాత్రమే కాదు, ప్రసాదాల తయారీలో ఉపయోగించే ప్రతి ముడి సరుకు కూడా కఠిన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని బోర్డు చెబుతోంది.
వైసీపీ పాలనలో చోటు చేసుకున్న కల్తీ నెయ్యి కేసు,కల్తీ శాలువాల వ్యవహారం కూడా హిందూ భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే ఇప్పుడు సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసమే టీటీడీకి ఆస్తి అని, ఆ విశ్వాసాన్ని కాపాడటమే తమ ప్రధాన బాధ్యత అని టీటీడీ తెలిపింది. నాణ్యత, పారదర్శకత, బాధ్యత అంశాలను కేంద్రంగా పెట్టుకుని కొత్త విధానాలను అమలు చేయబోతోంది టీటీడీ. కొనుగోళ్లలో ఎక్కడా రాజీ పడకుండా కల్తీ అనే మాట తిరుమల దరిదాపుల్లో వినిపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది టీటీడీ.