Mumbai Drugs : ముంబై డ్రగ్స్‌ కేసులో ముడుపుల వ్యవహారం

Mumbai Drugs : ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ అధికారి 25 కోట్లు షారూఖ్‌ను డిమాండ్‌ చేశారని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సెయిన్‌ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

Update: 2021-10-25 13:04 GMT

Mumbai Drugs : బాలీవుడ్‌ను కుదిపేస్తున్న ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంటోంది. తాజాగా ముడుపుల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ డ్రగ్స్‌ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ అధికారులపైనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్యన్‌ ఖాన్‌ విడుదలకు ఎన్‌సీబీ అధికారి 25 కోట్లు షారూఖ్‌ను డిమాండ్‌ చేశారని ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సెయిన్‌ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనికి బలం చేకూర్చేలా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మంత్రులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆరోపణల్లో సమీర్‌ వాంఖడే పేరు ప్రముఖంగా వినబడుతోంది.

తనపై వచ్చిన ముడుపుల ఆరోపణలను ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే తీవ్రంగా ఖండించారు. తనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కొందరు కుట్ర పనుతున్నారంటూ వాంఖడే... ముంబై పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాంఖడే లేఖ రాయడం చర్చనీయాంశమైంది. వాంఖడేకు దర్యాప్తు సంస్థ అండగా నిలిచింది. దర్యాప్తు సంస్థ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు రివర్స్‌ అటాక్‌ ఇచ్చింది.

మరోవైపు ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. బాలీవుడ్‌ యువనటి అనన్య పాండే... సోమవారం ఎన్‌సీబీ విచారణకు డుమ్మాకొట్టారు. ఈ కేసులో అరెస్టయిన్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్ ఖాన్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో అనన్య పేరు రావడంతో ఎన్‌సీబీ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. గతవారంలో రెండు సార్లు ఆమెను ప్రశ్నించిన ఎన్‌సీబీ అధికారులు.. సోమవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరుకావట్లేదని అనన్య సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌పై బాంబే హైకోర్టులో మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్యన్ కేసును వాదిస్తున్న లాయర్‌ను షారుక్‌ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌ కలిశారు. ఆర్యన్‌ ఇప్పటికే మూడు సార్లు బెయిల్‌ కోసం ప్రత్యేక న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకోగా కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో ఆర్యన్‌ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

Tags:    

Similar News