Huma Qureshi : డబ్బా వాలాగా మారిన హుమా ఖురేషీ
తర్లా దలాల్ చిత్రానికి మంచి ఆదరణ... హుమా ఖురేషీ నటనకు ప్రశంసలు... ఆనందాన్ని డబ్బావాలాలతో పంచుకున్న హుమా;
తర్లా దలాల్ అనే మహిళ అతి సాధారణ స్థాయి నుంచి దేశంలోనే ఫేమస్ చెఫ్ స్థాయికి ఎదిగిన తీరును తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ నటించిన తర్లా దలాల్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న తర్ల దలాల్‌లో హుమా ఖురేషీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందన్న టాక్ వచ్చింది. ఈ ఆనందాన్ని ముంబై డబ్బావాలాలతో పంచుకుంది హుమా. షారిబ్ హష్మీతో కలిసి ముంబై డబ్బావాలాలతో కలిసి భోజనం చేసింది.
దంగల్, చిచోరే సినిమాలకు రచయితగా పని చేసిన పీయుష్ గుప్తా దర్శకత్వంలో తర్లా దలాల్‌గా తెరకెక్కింది. రోనీ స్క్రూవాలా నిర్మాత. చిన్నప్పుడు తమ ఇంట్లో వంట గదిలో తర్లా దలాల్ పుస్తకం ఉండేది. ఆమె పుస్తకంలో ఉండే మాంగో ఐస్‌క్రీమ్ రెసెపీని చూసి అమ్మ మాకు తయారు చేసి ఇచ్చేది. ఈ సినిమా చేయమని నాకు ఆఫర్ వచ్చినప్పుడు అది గుర్తుకు వచ్చింది. తర్లా పాత్ర చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని హుమా ఖురేషీ అన్నారు.
తర్లా దలాల్ 2013లో మరణించారు. వంట అనేసరికి టీవీ చెఫ్‌గా ఇప్పటికీ ఆమె పేరే గుర్తుకొస్తుంది. వంటల మీద తర్లా దలాల్ రాసిన 100 పుస్తకాలు దాదాపు కోటి కాపీలు అమ్ముడుపోయాయి. భారతదేశంలో కోటి ఇళ్లల్లో ఆమె రెసిపీలు ఉపయోగించారని అంచనా. వీరుల, ధీరుల బయోపిక్‌లు తయారవుతున్న రోజుల్లో ఒక గొప్ప వంటగత్తె కథ బయోపిక్‌గా రావడం గొప్ప విషయమని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. తర్లాగా తెర మీద హ్యూమా ఖురేషి నటన కట్టిపడేసిందని కొనియాడుతున్నారు.