Kia Seltos : మార్కెట్లో పోటీని పెంచేందుకు కియా ప్రయత్నం.. 2027 లో సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్ రిలీజ్.. ఫీచర్లు ఇవే.
Kia Seltos : మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్ 2026లో తన మొదటి తరం అప్‌గ్రేడ్ ను పొందడానికి సిద్ధంగా ఉంది. దీని లాంచ్‌కు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా విడుదల కానప్పటికీ నెక్స్ట్-జెన్ మోడల్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2027లో దీని హైబ్రిడ్ వెర్షన్ కూడా వస్తుంది. 2026 కియా సెల్టోస్ ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లను అలాగే ఉంచుతూనే, మెరుగైన స్టైలింగ్, సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్ చేసిన టెక్నాలజీతో మరింత ప్రీమియంగా ఉండబోతోంది.
కొత్త సెల్టోస్ కియా సరికొత్త డిజైన్ ఫిలాసఫీ అయిన ఆపోజిట్స్ యునైటెడ్తో వస్తుంది. ఈ డిజైన్ ఫిలాసఫీ కియా కారెన్స్ తో భారత్‌లో ప్రారంభమైంది. కొత్త సెల్టోస్ ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, యాంగ్యులర్ DRLలతో సహా అనేక పెద్ద మార్పులను చూడవచ్చు. స్పై ఫోటోల ప్రకారం.. ఈ ఎస్‌యూవీలో కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వెనుక లైట్లను కలుపుతూ ఒక కంప్లీట్ ఎల్‌ఈడీ లైట్ స్ట్రిప్ కూడా ఉంటుంది. ఇది కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
గ్లోబల్ మార్కెట్లలో కొత్త తరం సెల్టోస్ పొడవు దాదాపు 100 మి.మీ పెరుగుతుంది. దీనితో ఇది తన కేటగిరీలోనే అత్యంత పొడవైన ఎస్‌యూవీగా మారుతుంది. ఇది జీప్ కంపాస్ కంటే కూడా పొడవుగా ఉంటుంది. అయితే, భారతదేశంలో విడుదల కాబోయే మోడల్‌లో కూడా ఇదే మార్పులు ఉంటాయా లేదా ప్రస్తుత సైజ్ నే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.
2026 కియా సెల్టోస్ ఇంటీరియర్‌లో కియా సైరోస్ మోడల్ నుండి తీసుకున్న ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ కోసం 5 ఇంచుట టచ్‌స్క్రీన్ ఉంటాయి. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫీచర్లతో పాటు, 2026 కియా సెల్టోస్‌లో మెరుగైన క్యాబిన్ ఎక్స్ పీరియన్స్ కోసం మరిన్ని అదనపు ఫీచర్లను కూడా అందించే అవకాశం ఉంది. 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లే కొనసాగుతాయి.
అయితే ఆ తర్వాత 2027లో దీని హైబ్రిడ్ వెర్షన్ కూడా ఈ లైనప్‌లో చేరనుంది. హైబ్రిడ్ వెర్షన్ టెక్నాలజీ వివరాలు ఇంకా తెలియకపోయినా, సెల్టోస్ హైబ్రిడ్‌లో 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఇవ్వవచ్చు.