Duster vs Creta 2026 : డస్టర్ vs క్రెటా..సైజ్, ఫీచర్లు..ఈ యుద్ధంలో గెలిచేది ఎవరో తెలుసా?

Update: 2026-02-05 07:45 GMT

Duster vs Creta 2026 : భారతీయ రోడ్లపై ఒకప్పుడు రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ మళ్లీ కొత్త అవతారంలో తిరిగి రాబోతోంది. అయితే ఈసారి పోటీ అంత సులభంగా లేదు. మార్కెట్ లీడర్‌గా ఉన్న హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టేందుకు డస్టర్ సిద్ధమవుతోంది. మరి ఈ రెండింటిలో ఏది మీ ఇంటికి వెళ్తే బాగుంటుంది? ఆ వివరాలు చూద్దాం. కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ తన ప్రత్యర్థి హ్యుందాయ్ క్రెటా కంటే అన్ని విషయాల్లోనూ పెద్దదిగా కనిపిస్తోంది. ఈ కొత్త డస్టర్ క్రెటా కంటే 16 మి.మీ పొడవు, 25 మి.మీ వెడల్పు, 68 మి.మీ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కారు లోపల స్పేస్ గురించి మాట్లాడితే, డస్టర్ వీల్‌బేస్ క్రెటా కంటే 47 మి.మీ ఎక్కువగా ఉంది, దీనివల్ల వెనుక సీటులో కూర్చునే వారికి ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది. ఇక ప్రయాణాల్లో సామాన్లు పెట్టుకోవడానికి ఉపయోగపడే బూట్ స్పేస్ విషయానికి వస్తే, డస్టర్ ఏకంగా 85 లీటర్ల అదనపు స్థలాన్ని అందిస్తోంది. అంటే లాంగ్ ట్రిప్స్ వేసే ఫ్యామిలీలకు డస్టర్ ఒక మంచి ఆప్షన్ కానుంది.

ఇంజిన్, ఫీచర్లు

ఇక్కడ రెండు కార్లు కూడా వేర్వేరు వ్యూహాలతో వస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా ఇప్పటికీ డీజిల్ ఇంజిన్ కోరుకునే వారికి మొదటి ఛాయిస్‌గా ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి. దీనికి భిన్నంగా రెనాల్ట్ డస్టర్ డీజిల్ ఇంజిన్‌ను పూర్తిగా పక్కన పెట్టింది. డస్టర్ లో 1.0 లీటర్ టర్బో, 1.3 లీటర్ మైల్డ్-హైబ్రిడ్,1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్లు అందుబాటులో ఉంటాయి. మైలేజీ గురించి ఆలోచించే వారికి డస్టర్ లోని హైబ్రిడ్ వెర్షన్లు బాగా నచ్చుతాయి. అయితే ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం డస్టర్ లో 4x4 ఆప్షన్ ఉండే అవకాశం ఉంది, ఇది క్రెటాలో లేదు.

ధర, లాంచ్ ఎప్పుడు?

2026 రెనాల్ట్ డస్టర్ మార్చి నెల మధ్యలో భారత్‌లో గ్రాండ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. మరోవైపు, ఇప్పటికే మార్కెట్ లో స్థిరపడిన హ్యుందాయ్ క్రెటా ధర రూ.10.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ కు రూ.20.20 లక్షల వరకు ఉంటుంది. ఒకవేళ డస్టర్ తన హైబ్రిడ్ టెక్నాలజీతో తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే, క్రెటా అమ్మకాలకు గట్టి గండి పడే అవకాశం ఉంది.

ఏది కొనాలి ?

మీరు కారులో ఎక్కువ స్థలం, ఆఫ్-రోడింగ్ కెపాసిటీ, హైబ్రిడ్ టెక్నాలజీని కోరుకుంటే 2026 రెనాల్ట్ డస్టర్ కోసం వేచి చూడటం మంచిది. కానీ మీకు ఖచ్చితంగా డీజిల్ ఇంజిన్ కావాలి, కారు రీసేల్ వాల్యూ బాగుండాలి.. లగ్జరీ ఇంటీరియర్స్ ఇంపార్టెంట్ అనుకుంటే హ్యుందాయ్ క్రెటా ఇప్పటికీ మార్కెట్ లో ది బెస్ట్ ఆప్షన్. మార్చి 2026 తర్వాత ఈ రెండు దిగ్గజాల మధ్య జరిగే అసలైన పోటీ రసవత్తరంగా మారనుంది.

Tags:    

Similar News