Triumph : స్టైల్ మారింది..స్టామినా పెరిగింది..ట్రయంఫ్ 660 సిరీస్‌లో భారీ మార్పులు.

Update: 2026-01-22 08:00 GMT

Triumph : ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన మిడ్-వెయిట్ విభాగంలో తిరుగులేని ముద్ర వేయడానికి 2026 మోడళ్లను సిద్ధం చేసింది. ముఖ్యంగా ట్రైడెంట్ 660ను మునుపటి కంటే చాలా స్పోర్టీగా తీర్చిదిద్దింది. దీని బాడీ డిజైన్ ఇప్పుడు మరింత షార్ప్‌గా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ వెడల్పుగా మారి బైక్‌కు ఒక భారీ లుక్‌ను ఇస్తోంది. దీని హెడ్‌లైట్ డిజైన్‌ను తన పెద్దన్న అయిన ట్రైడెంట్ 800 స్ఫూర్తితో మార్చారు. రైడర్ల సౌకర్యం కోసం సీటు డిజైన్, హ్యాండిల్ పొజిషన్‌లో కూడా మార్పులు చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే, వెనుక భాగంలో కొత్త షోవా రియర్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు, దీనిని రైడర్ తన ఇష్టానుసారం అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఇక టూరింగ్ ప్రియుల కోసం టైగర్ స్పోర్ట్ 660ను మరింత పవర్ఫుల్‎గా మార్చారు. లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి ఇబ్బంది లేకుండా దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యాన్ని 18.6 లీటర్లకు పెంచారు. గాలి, వాతావరణం నుంచి రక్షణ కల్పించడానికి దీని విండ్‌స్క్రీన్‌ను అడ్జస్ట్ చేసుకునే సదుపాయం కల్పించారు. వెనుక సస్పెన్షన్ ఇప్పుడు రిమోట్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో వస్తోంది, దీనివల్ల వెనుక ప్యాసింజర్ లేదా లగేజీ ఉన్నప్పుడు సెట్టింగ్స్ మార్చుకోవడం చాలా సులభం అవుతుంది. 211 కిలోల బరువు ఉన్న ఈ బైక్ హైవేలపై తిరుగులేని స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది.

ఈ రెండు బైక్‌లలోని అసలైన మ్యాజిక్ వాటి ఇంజిన్లలో ఉంది. 660cc ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజిన్‌ను కంపెనీ పూర్తిగా రీ-ట్యూన్ చేసింది. దీనివల్ల పవర్ ఇప్పుడు ఏకంగా 95hp కి చేరుకుంది (ఇది పాత మోడల్ కంటే 14hp ఎక్కువ). టార్క్ విషయానికొస్తే 68Nm వరకు అందిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం 3,000rpm వద్దే 80 శాతం టార్క్ అందుబాటులోకి వస్తుంది. అంటే సిటీ ట్రాఫిక్‌లో కూడా పదే పదే గేర్లు మార్చే అవసరం లేకుండా బైక్ దూసుకుపోతుంది. రెడ్‌లైన్ పరిమితిని కూడా 12,650rpm వరకు పెంచారు, దీనివల్ల బైక్ టాప్ ఎండ్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

టెక్నాలజీ పరంగా చూస్తే.. సరికొత్త థొరాటిల్ సిస్టమ్, మెరుగైన ఎయిర్‌బాక్స్, అడ్వాన్సుడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఇందులో చేర్చారు. కొత్త కలర్ ఆప్షన్లు, అదిరిపోయే గ్రాఫిక్స్‌తో ఈ బైక్‌లు ప్రీమియం లుక్‌ను సంతరించుకున్నాయి. బ్రేకింగ్ కోసం నిస్సిన్ కాలిపర్స్, రోడ్డుపై గ్రిప్ కోసం మిచెలిన్ రోడ్ 5 టైర్లను వాడారు. ఓవరాల్‌గా, 2026 ట్రయంఫ్ 660 సిరీస్ పాత మోడల్ కంటే చాలా వేగంగా, సౌకర్యవంతంగా, మోడ్రన్‎గా మారింది.

Tags:    

Similar News