Volkswagen Taigun : వచ్చేస్తోంది కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగూన్.. లగ్జరీ ఫీచర్లతో అదిరిపోయే ఎంట్రీ.
Volkswagen Taigun : ఫోక్స్‌వ్యాగన్ ప్రియులకు అదిరిపోయే వార్త. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు, లీకైన సమాచారం ప్రకారం ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కావడానికి ఎంతో సమయం లేదు. వచ్చే మార్చి 2026లో ఈ సరికొత్త ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకునేలా, ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ మోడల్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా డిజైన్, లగ్జరీ ఫీచర్ల విషయంలో ఈసారి టైగూన్ అదరగొట్టబోతోంది.
కొత్త టైగూన్‌లో కస్టమర్లను ఊరించే అతిపెద్ద మార్పు పనోరమిక్ సన్‌రూఫ్. ప్రస్తుతం చాలామంది కొనుగోలుదారులు ఎస్‌యూవీలలో సన్‌రూఫ్‌ను ప్రధానంగా చూస్తున్నారు. అందుకే టాప్-ఎండ్ మోడళ్లలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను, ఎంట్రీ లెవల్ వేరియంట్లలో సింగిల్ ప్యానెల్ సన్‌రూఫ్‌ను కంపెనీ ఆఫర్ చేయనుంది. దీనితో పాటు, ఈ సెగ్మెంట్‌లో మరే కారులో లేని విధంగా వెనుక సీట్లకు మసాజ్ ఫీచర్‌ను తీసుకువస్తోంది. సాధారణంగా లగ్జరీ కార్లలో కనిపించే ఈ ఫీచర్ ఇప్పుడు తైగూన్ కస్టమర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
మెకానికల్ పరంగా చూస్తే, ఇంజన్ ఆప్షన్లు పాతవే (1.0L, 1.5L TSI) కొనసాగినప్పటికీ, ట్రాన్స్‌మిషన్‌లో ఒక మేజర్ అప్‌డేట్ ఉంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ను పరిచయం చేయబోతున్నారు. ఇది డ్రైవింగ్ అనుభూతిని మరింత స్మూత్‌గా మార్చడమే కాకుండా మైలేజీ విషయంలోనూ మెరుగైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కారు ముందు, వెనుక భాగాన్ని పూర్తిగా రీ-డిజైన్ చేస్తున్నారు. విదేశీ మార్కెట్లోని టైగ్వాన్ ఆర్-లైన్ మోడల్ లాగే దీనికి అదిరిపోయే లుక్ ఇవ్వనున్నారు.
సేఫ్టీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్ ఎప్పుడూ రాజీ పడదు. కొత్త టైగూన్ ఫేస్‌లిఫ్ట్‌లో బేస్ వేరియంట్ నుంచే దాదాపు 25కి పైగా సేఫ్టీ ఫీచర్లను అందించనున్నారు. గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, కొత్త స్టైల్ ఇండికేటర్లు, అదిరిపోయే అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.