Maruti e-Vitara : కేవలం రూ.10.99 లక్షలకే మారుతి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ..ధర తక్కువే కానీ డెలివరీకి వెయిటింగ్ తప్పదు.
Maruti e-Vitara : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారాను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ కారు ధర, అందులోని ఫీచర్లు చూసి పోటీ కంపెనీలకు చెమటలు పడుతున్నాయి. బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ పద్ధతిలో కేవలం రూ.10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇది లభిస్తుండగా, బ్యాటరీతో కలిపి కొంటే రూ.15.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ ధరకే ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ దొరుకుతుండటంతో కస్టమర్లు షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు.
అయితే ఈ విటారాను ఇంటికి తీసుకెళ్లాలనుకునే వారు కొంచెం ఓపిక పట్టాల్సిందే. ప్రస్తుతం ఈ కారుకు ఉన్న భారీ డిమాండ్ కారణంగా డెలివరీల కోసం నిరీక్షణ తప్పదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ విటారాలోని అన్ని వేరియంట్లపై సగటున 2 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. మీరు ఉండే నగరం, ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి ఈ సమయం మారవచ్చు. ఇప్పటికే కంపెనీ డెలివరీలను ప్రారంభించినప్పటికీ, బుకింగ్స్ వెల్లువలా వస్తుండటంతో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతోంది.
ఈ విటారా మూడు ప్రధాన వేరియంట్లలో (డెల్టా, జీటా, ఆల్ఫా) లభిస్తోంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ అయిన డెల్టాలో 49 kWh బ్యాటరీ ఉంటుంది, ఇది 144 HP పవర్, 193 Nm టార్క్ ఇస్తుంది. దీని రేంజ్ సుమారు 440 కిలోమీటర్లు. ఇక హై-ఎండ్ వేరియంట్లు జీటా, ఆల్ఫాలలో 61 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 174 HP పవర్, 198 Nm టార్క్‌తో దూసుకుపోతుంది. ఈ పెద్ద బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 543 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ARAI సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
మార్కెట్లో పోటీ విషయానికి వస్తే, మారుతి ఈ-విటారా తన ధరతో టాటా కర్వ్ ఈవీ (రూ.17.49 లక్షలు), హ్యుందాయ్ క్రెటా ఈవీ (రూ.18.02 లక్షలు), మహీంద్రా BE 6 (రూ.18.90 లక్షలు), ఎంజీ విండ్‌సర్ ఈవీ (రూ.15.49 లక్షలు) వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రత్యర్థుల కంటే తక్కువ ధరకే లభిస్తుండటం, మారుతి సుజుకిపై ఉన్న నమ్మకం ఈ కారును ఈవీ సెగ్మెంట్‌లో హాట్ కేకులా మార్చేశాయి.