Hyundai Creta : క్రెటాలో బాస్ మోడ్..కొత్త ఫీచర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించనున్న హ్యుందాయ్.
Hyundai Creta : మిడ్ సైజ్ ఎస్యూవీ కింగ్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. ఇండియాలో ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న క్రెటా, ఇప్పుడు సరికొత్త అవతారంలోకి మారేందుకు సిద్ధమవుతోంది. 2027 నాటికి గ్లోబల్ మార్కెట్లోకి రానున్న నెక్స్ట్ జనరేషన్ క్రెటాలో మునుపెన్నడూ లేని విధంగా లగ్జరీ ఫీచర్లను జోడిస్తోంది హ్యుందాయ్. ముఖ్యంగా ఇందులో రాబోయే బాస్ మోడ్ ఫీచర్ ఇప్పుడు కియా సెల్టోస్, మారుతీ గ్రాండ్ విటారా వంటి ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది.
కొత్త క్రెటా ఇంటీరియర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో హ్యుందాయ్ ఐయోనిక్-5 ఎలక్ట్రిక్ కారులో ఉండే జీరో గ్రావిటీ బటన్ వంటి ఫీచర్ కనిపిస్తోంది. ఈ బటన్ నొక్కగానే ప్యాసింజర్ సీటు వెనక్కి వాలిపోయి, కింద నుంచి ఫుట్‌రెస్ట్ వస్తుంది. అంటే కారులో వెళ్తున్నప్పుడు మనం ఇంట్లో సోఫాలో పడుకున్నంత హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న క్రెటాలో సీటును అడ్జస్ట్ చేసే బాస్ మోడ్ ఉన్నప్పటికీ, ఈ కొత్త ఫుట్‌రెస్ట్ సౌకర్యం మాత్రం అదనపు ఆకర్షణ కానుంది. ఇది ముఖ్యంగా వెనుక కూర్చునే వారికి లగ్జరీ అనుభూతిని ఇస్తుంది.
టెస్టింగ్ లో ఉన్న క్రెటా మోడల్‌ను గమనిస్తే, దీనికి 19 అంగుళాల భారీ అలాయ్ వీల్స్ అమర్చారు. ప్రస్తుతం క్రెటాలో గరిష్టంగా 18 అంగుళాల వీల్స్ మాత్రమే ఉన్నాయి. పెద్ద చక్రాల వల్ల కారుకు మరింత స్పోర్టీ, మజిల్ లుక్ రానుంది. అయితే ఇండియన్ రోడ్లపై 19 ఇంచ్ చక్రాలు ప్రయాణ సౌకర్యాన్ని కొంచెం తగ్గిస్తాయనే భయం కూడా ఉంది. అందుకే వీటిని కేవలం టాప్ ఎండ్ వేరియంట్లు లేదా N-Line వెర్షన్లకే పరిమితం చేసే అవకాశం ఉంది.
కొత్త క్రెటా డ్యాష్‌బోర్డ్ కూడా పూర్తిగా మారబోతోంది. పెద్ద సైజు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సరికొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అప్‌గ్రేడెడ్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ప్యాకేజీ ఇందులో ఉండనున్నాయి. కారు కనెక్టివిటీ ఫీచర్లు మరింత వేగంగా పనిచేసేలా సాఫ్ట్‌వేర్ లో మార్పులు చేస్తున్నారు. సీట్ కవర్ల డిజైన్, డోర్ ట్రిమ్స్ కూడా ప్రీమియం లుక్‌లో కనిపించబోతున్నాయి. టెస్టింగ్ మోడల్‌లో సన్‌రూఫ్ కనిపించనప్పటికీ, ప్రొడక్షన్ వెర్షన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ తప్పకుండా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ తన నమ్మకమైన ఇంజిన్లనే కొనసాగించనుంది. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటికి మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు జోడించనున్నారు. 2027 కల్లా ఈ కారు మార్కెట్లోకి వస్తే, ఎస్‌యూవీ విభాగంలో మళ్ళీ క్రెటాదే హవా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.