Real Estate : హైదరాబాద్, బెంగళూరులో ధరల సెగ..సామాన్యుడి 12 ఏళ్ల కష్టార్జితం పోస్తేనే ఒక ఇల్లు.

Update: 2026-01-23 05:15 GMT

Real Estate : సొంతిల్లు.. ప్రతి సామాన్యుడి జీవితకాల స్వప్నం. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ కల నిజం చేసుకోవడం ఒక అసాధ్యమైన సవాలుగా మారుతోంది. ముఖ్యంగా నగరాల్లో తలదాచుకోవడానికి ఒక 3BHK ఫ్లాట్ కొనడం అనేది ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కలగానే మారిపోయింది. ప్రముఖ ప్రాప్‌టెక్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసిన తాజా నివేదిక దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న చేదు నిజాన్ని బట్టబయలు చేసింది. భారతదేశంలోని టాప్ ఐదు మెట్రో నగరాల్లో ఒక కొత్త 3BHK ఫ్లాట్ సగటు ధర ఇప్పుడు ఏకంగా రూ.2.7 కోట్లకు చేరుకుందని ఈ నివేదిక వెల్లడించింది.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక వ్యక్తి ఏడాదికి రూ.23 లక్షలు సంపాదిస్తున్నాడనుకుంటే, అతను తన జీతంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా దాదాపు 12 ఏళ్ల పాటు పొదుపు చేస్తేనే ఒక 3BHK ఫ్లాట్ కొనగలడని ఈ నివేదిక చెబుతోంది. విచారకరమైన విషయం ఏమిటంటే.. దేశంలోని టాప్ 1 శాతం సంపాదనపరుల సగటు ఆదాయం కూడా దాదాపు రూ.22 లక్షల లోపే ఉంది. అంటే, దేశంలోని అత్యంత ధనవంతుల వర్గానికి కూడా నగరాల్లో పెద్ద ఇల్లు కొనడం ఇప్పుడు తలకు మించిన భారంగా మారుతోంది. సంపాదనకు, ఇళ్ల ధరలకు మధ్య ఉన్న అంతరం రోజురోజుకూ పెరిగిపోతోంది.

గత కొన్నేళ్లుగా పెద్ద ఇళ్ల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి. ఇంటి నుండే ఆఫీసు పనులు చేసుకోవడం వల్ల అందరికీ ఒక ప్రత్యేక గది, ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తోంది. దీంతో పాటు మారుతున్న కుటుంబ అవసరాలు, మెరుగైన సౌకర్యాల కోసం మధ్యతరగతి ప్రజలు 3BHK ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే సమయంలో భూమి ధరలు పెరగడం, నిర్మాణ సామాగ్రి ఖర్చులు భారమవ్వడం, బిల్డర్లు ఎక్కువగా ప్రీమియం ప్రాజెక్టులనే నిర్మిస్తుండటంతో ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లాయి.

నివేదిక ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త ఇళ్లలో కేవలం 11 శాతం మాత్రమే అఫోర్డబుల్ అంటే సామాన్యుడి బడ్జెట్‌లో ఉన్నాయి. మిగిలిన 89 శాతం ఇళ్లు అధిక ధరలతో మధ్యతరగతి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఫలితంగా దాదాపు 41 శాతం మార్కెట్‌లో ఇళ్లు కొనేవారు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. అంటే, ఇల్లు కొన్నాక కట్టే ఈఎంఐలు వారి నెలవారీ ఆదాయంలో సగానికి పైగా హరించేస్తున్నాయి. ఇది కుటుంబాల ఆర్థిక సమతుల్యతను దెబ్బతీస్తోంది.

నగరాల వారీగా చూస్తే పరిస్థితి వేర్వేరుగా ఉంది. బెంగళూరులో జీతాలు పెరగడంతో పాటు ధరలు కూడా సమాంతరంగా పెరగడం వల్ల అక్కడ మార్కెట్ కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. కానీ హైదరాబాద్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఆదాయం కంటే ఇళ్ల ధరలే రెట్టింపు వేగంతో పెరిగాయి, దీనివల్ల స్థానికులకు ఇల్లు కొనడం గగనమైపోయింది. ముంబై, ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ధరలు విపరీతంగా ఉండటంతో ప్రజలు సరైన లోకేషన్ ఎంచుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పుణె వంటి నగరాల్లో సామాన్యులు నగరం నడిబొడ్డున ఇల్లు కొనలేక శివారు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

అయితే ఈ కష్టకాలంలోనూ ఒక చిన్న ఉపశమనం ఉందని నివేదిక సూచిస్తోంది. కొనుగోలుదారులు గర్వంగా నగరం మధ్యలోనే ఉండాలని కాకుండా, పెరుగుతున్న శివారు ప్రాంతాలను ఎంచుకుంటే సుమారు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఇప్పుడు మెట్రో రైలు,పెరిగిన రోడ్డు సౌకర్యాల వల్ల శివారు ప్రాంతాల నుంచి నగరానికి రావడం సులభమైంది. కాబట్టి బడ్జెట్ తక్కువగా ఉన్నవారు లోకేషన్ విషయంలో కొంచెం రాజీపడితే సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Tags:    

Similar News