7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం కొత్త నియమం.. ఉద్యోగుల డ్రెస్ అలవెన్స్‌పై భారీ ప్రభావం.
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అలవెన్సులపై కేంద్రం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డ్రెస్ అలవెన్స్ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం మార్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, జులై 1, 2025 తర్వాత ఉద్యోగంలో చేరే కొత్త ఉద్యోగులకు కూడా ప్రయోజనం లభించనుంది. మిడ్-ఇయర్‌లో ఉద్యోగంలో చేరిన లేదా రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఈ డ్రెస్ అలవెన్స్ ఎంత, ఎప్పుడు చెల్లిస్తారు అనే విషయంలో ఈ కొత్త ఆదేశాలు స్పష్టతనిచ్చాయి. ఈ మేరకు డాక్ విభాగం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
సెప్టెంబర్ 24, 2025న జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం, మధ్య సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన లేదా రిటైర్ అయ్యే ఉద్యోగులకు డ్రెస్ అలవెన్స్ ఇకపై అనుపాత ప్రాతిపదికన చెల్లించబడుతుంది. డ్యూటీ సమయంలో యూనిఫాం ధరించాల్సిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఈ డ్రెస్ అలవెన్స్. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2017 ఆగస్టులో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, బట్టల భత్యం, బేసిక్ ఎక్విప్‌మెంట్ భత్యం, యూనిఫాం నిర్వహణ భత్యం, గౌన్ భత్యం, షూ భత్యం వంటి పాత అలవెన్సులన్నింటినీ కలిపి ఇప్పుడు డ్రెస్ అలవెన్స్‌గా చెల్లిస్తున్నారు.
గతంలో జూలై 2025 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగుల డ్రెస్ అలవెన్స్ చెల్లింపుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టత కోరారు. ఇప్పుడు ఆ స్పష్టత వచ్చింది. జూన్ 2025లో జారీ చేసిన పాత ఆదేశంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వివరణ వచ్చేవరకు 2020 పాత నిబంధనలే అమలులో ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు ఏ విధంగా అయితే అనుపాత డ్రెస్ అలవెన్స్ చెల్లిస్తారో, అదే విధంగా సంవత్సరంలో మధ్యలో రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా అనుపాత ప్రాతిపదికన డ్రెస్ అలవెన్స్ లభిస్తుంది.
సాధారణంగా డ్రెస్ అలవెన్స్‌ను జులై నెల జీతంతో కలిపి చెల్లిస్తారు. దీనికి సంబంధించిన రికవరీ విషయంలో డాక్ విభాగం స్పష్టత ఇచ్చింది. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే జులై జీతంలో పూర్తిగా లేదా సగం అలవెన్స్ పొందారు. కొత్త నిబంధనల ప్రకారం, అక్టోబర్ 2025 నుండి రిటైర్ అయ్యే ఉద్యోగుల నుంచి అవసరమైతే, అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తారు. అయితే, సెప్టెంబర్ 30, 2025 కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగుల నుంచి ఎలాంటి రికవరీ ఉండదు అని స్పష్టం చేశారు. జూలై 2025 కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారికి, జూన్ 2025 వరకు అమలులో ఉన్న పాత నిబంధనల ప్రకారమే డ్రెస్ అలవెన్స్ లభిస్తుంది. గత సంవత్సరం డ్రెస్ అలవెన్స్ జులై 2025 జీతంలో కలపని సందర్భాలు ఉంటే, దాన్ని వెంటనే సరిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు.