Air India Express : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్- ఏఐఎక్స్ కనెక్ట్ విలీన ప్రక్రియ పూర్తయ్యింది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈవిషయాన్ని మంగళవారం వెల్లడించింది. విలీనానికి కావాల్సిన నియంత్రణపరమైన ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఏఐఎక్స్ కనెక్ట్ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేరుతో నడవనున్నాయి. విలీనం అనంతరం కార్యకలాపాలను పరిశీలిస్తామని డీజీసీఏ తెలిపింది. ప్రస్తుతం ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియ జరుగుతోందని డీజీసీఏ చీఫ్ విక్రమ్ దేవ్‌దత్ తెలిపారు. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్.. ఈ నాలుగూ టాటా గ్రూపునకు చెందిన విమాన సంస్థలే. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌ను; ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్‌లు రోజువారీగా సుమారు 400 విమాన సర్వీసులు నడుపుతున్నాయి. విలీన సంస్థలో సుమారు 6,000 మంది ఉద్యోగులు ఉంటారు. ఇక ఎయిరిండియాలో విస్తారా విలీన ప్రక్రియ నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.