Air India : ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం..ఎయిర్ ఇండియాకు కోటిన్నర జరిమానా.
Air India : సాధారణంగా విమానం గాల్లోకి లేవాలంటే దానికి ఎయిర్ వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ తప్పనిసరి. అంటే ఆ విమానం ప్రయాణికులను తీసుకెళ్లడానికి సాంకేతికంగా పూర్తి ఫిట్‌గా ఉందని ఇచ్చే ధృవీకరణ పత్రం అన్నమాట. కానీ, ఎయిర్ ఇండియాకు చెందిన ఒక ఎయిర్‌బస్ A320 విమానం ఈ సర్టిఫికేట్ గడువు ముగిసినా కూడా ఏకంగా 8 సార్లు ప్రయాణికులతో గాల్లోకి ఎగిరింది. ఈ భయంకరమైన నిర్లక్ష్యంపై డీజీసీఏ ఇప్పుడు రూ.1.10 కోట్ల భారీ జరిమానా వడ్డించింది.
ఎక్కడెక్కడ తిరిగింది? ఏం జరిగింది?
గత ఏడాది నవంబర్ 24, 25 తేదీల మధ్య ఈ ఘటన జరిగింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి రద్దీ నగరాల మధ్య ఈ విమానం చక్కర్లు కొట్టింది. విమానం ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేదన్న విషయాన్ని ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ గానీ, విమానం నడిపిన పైలట్లు గానీ గుర్తించకపోవడం గమనార్హం. పైలట్లు టేకాఫ్ కంటే ముందు చెక్ చేయాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను గాలికొదిలేశారని విచారణలో తేలింది. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ఈ విమానాన్ని నడపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తప్పు ఒప్పుకున్న ఎయిర్ ఇండియా
ఈ వ్యవహారంలో ఎయిర్ ఇండియా తన తప్పును అంగీకరించింది. ఇది తమ సిస్టమ్ ఫెయిల్యూర్ అని సంస్థ అంతర్గత విచారణలో తేల్చింది. నిబంధనల ప్రకారం ప్రతినెలా, ప్రతి ఏడాది జరగాల్సిన తనిఖీలను సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యామని పేర్కొంది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ మనీష్ కుమార్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 30 రోజుల్లోగా జరిమానా కట్టాలని ఆదేశించారు. అంతేకాదు, ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌ను కూడా ఈ లోపానికి బాధ్యుడిగా చేస్తూ నోటీసులు పంపారు.
టాటా గ్రూప్‌కు తప్పని తిప్పలు
ఎయిర్ ఇండియా ఇప్పుడు టాటా గ్రూప్ చేతుల్లో ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎయిర్‌లైన్స్‌ను ముందుకు తీసుకెళ్లాలని టాటా భావిస్తున్న తరుణంలో.. ఇలాంటి ఘటనలు బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. గతంలో కూడా ఎమర్జెన్సీ ఎక్విప్‌మెంట్ లేకుండా విమానాలు నడపడంపై డీజీసీఏ హెచ్చరించింది. ముఖ్యంగా గత జూన్‌లో ఒక బోయింగ్ విమానం ప్రమాదానికి గురై 260 మంది ప్రాణాలు కోల్పోయిన చేదు జ్ఞాపకం ఉండగానే.. మళ్ళీ ఇలాంటి భద్రతా లోపాలు బయటపడటం ప్రయాణికులను కలవరపెడుతోంది.