ALERT: సెకండ్ హ్యాండ్ వాహనాలతో పారాహుషార్
ఢిల్లీ పేలుడులో ఓనర్ కొంపముంచిన కారు... రిజిస్ట్రేషన్ చేయించకుండానే అమ్మకం... వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త
ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశ రాజధాని భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా దర్యాప్తు సంస్థలకు ఓ చిక్కుముడిని విసిరింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పేలుడు సంభవించిన తెలుపు ఐ20 కారు.. కేవలం ఓ సంవత్సరంలోనే ఏడుగురి చేతులు మారినా, రికార్డుల్లో మాత్రం యజమాని పేరు మారలేదని తేలింది. ఈ కారే ఇప్పుడు ఉగ్రవాద కుట్రలో అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. HR26CE7674 నంబర్ గల ఈ కారు 2013లో తయారు చేయబడి 2014లో గురుగ్రామ్‌కు చెందిన సల్మాన్ పేరుపై రిజిస్టర్ అయ్యి ఉంది. పేలుడుకు సంబంధించిన అన్ని పత్రాలలో ఇప్పటికీ సల్మాన్ పేరే ఉంది. సల్మాన్‌ను విచారించగా.. అతను ఈ కారును ఓఖ్లా నివాసి దేవేంద్రకు అమ్మినట్లు తెలిపాడు. దేవేంద్ర దానిని అంబాలాకు చెందిన వ్యక్తికి, ఆ తర్వాత పుల్వామాకు చెందిన ఆమిర్‌కు విక్రయించారు. ఆమిర్ నుంచి ఈ కారు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ చేతికి చివరకు డాక్టర్ ఉమర్ మహమ్మద్ వరకు చేరింది. దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం ప్రకారం.. ఈ కారు కనీసం ఏడుగురి చేతులు మారినా రిజిస్ట్రేషన్ మాత్రం సల్మాన్ పేరుపైనే ఉంది. పన్నులు, ఇతర పేపర్ వర్క్ నుంచి తప్పించుకునేందుకు సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ బదిలీ చేయకపోవడం మొదటి ఓనరుకు చాలా ఇబ్బందులే తెచ్చి పెట్టింది.
మీరు ఈ తప్పులు చేయకండి
అందుకే సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనే ముందు, అమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. లేకపోతే ఢిల్లీ పేలుళ్ల లాంటి ఉదంతాలలో మీరు చిక్కుకుపోవడం లేదా ఇతర సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదముంది. మొదటగా వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఖచ్చితంగా తనిఖీ చేయాలి. ఆ ఆర్సి జెన్యూన్దా, యజమాని వివరాలు సరైనవేనా చూడాలి. కొంతమంది వాహనంపై ఉన్న పాత చలాన్లను, పెండింగ్ కేసులను బయటపెట్టకుండా వాహనం అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి e-challan వెబ్సైట్లో వాహనం నంబర్ నమోదు చేసి చలాన్లు ఉన్నాయా లేదో పరిశీలించాలి. వీటితో పాటు వాహనం ఇన్సూరెన్స్ పాలసీ చూసుకోవాలి. చెల్లుబాటులో ఉన్న పాలసీ ఉంటే ప్రమాదం జరిగినప్పుడు కవరేజీ లభిస్తుంది. పాత బైక్‌కి ఇది చాలా ముఖ్యం. అలాగే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి. ఇది వాహనం కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారిస్తుంది.
ఇది అంత్యంత ముఖ్యమైనది
వాహనం చాసిస్ నంబర్ తనిఖీ చేయాలి. ఆర్సీపై చాసిస్ నంబర్‌కి వాహనంపై ఉన్నది సరిపోతుందా అనే విషయంలో జాగ్రత్తగా చూడాలి. పత్రాలు అన్ని ఒరిజినల్‌గా ఉన్నాయా? నకిలీ ఆర్ సీ తీసుకువచ్చి తప్పుడు వాహనాలు అమ్మే వారు కూడా ఉంటారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంకా 15 ఏళ్లు దాటిన వాహనాలను కొందరు తుక్కు చేయాల్సింది అని తెలిసీ ఎలాగోలా అమ్మే ప్రయత్నం చేస్తారు. వాహనం రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయిందో స్పష్టంగా చూసి తర్వాతే కొనాలి. వాహనం ఇతర ప్రాంతంలో రిజిస్టర్ అయి ఉండి అక్కడి నుండి మీ జిల్లా కేంద్రానికి మారితే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్న పొరపాటుతో వాహనం కొనుగోలు తర్వాత సమస్యల్లో పడకుండా, ఆర్థిక నష్టం పొందకుండా జాగ్రత్త తప్పనిసరిగా పాటించమని ట్రాఫిక్ పోలీసులు సలహా ఇస్తున్నారు.