Mutual Fund : మ్యూచువల్ ఫండ్స్ వెనక్కి తగ్గుతున్నాయా? రూ.4,100 కోట్ల విక్రయాల వెనుక అసలు సీక్రెట్ ఇదే.

Update: 2026-02-16 06:15 GMT

Mutual Fund : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ షాక్ ఇచ్చాయి. గత మూడేళ్లుగా భారతీయ మార్కెట్‌లో నిరంతరం కొనుగోళ్లు జరుపుతూ బుల్‎లకు అండగా నిలిచిన మ్యూచువల్ ఫండ్స్, ఈ ఫిబ్రవరిలో తమ రూటు మార్చాయి. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు ఏకంగా రూ.4,100 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. అంటే వారు ఇప్పుడు నెట్ సెల్లర్స్‎గా మారిపోయారు. గత మూడేళ్ల కాలంలో మ్యూచువల్ ఫండ్స్ ఇలా నికరంగా షేర్లను విక్రయించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫిబ్రవరిలోని ఏడు ట్రేడింగ్ రోజుల్లో ఆరు రోజులు అమ్మకాలే జరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నిజానికి జనవరి 2026లో మ్యూచువల్ ఫండ్స్ ఏకంగా రూ.42,000 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. గతేడాది 2025లో మొత్తం మీద చూసుకుంటే దాదాపు రూ.4.93 లక్షల కోట్లను భారత మార్కెట్‌లో కుమ్మరించాయి. ఇంతటి భారీ పెట్టుబడుల తర్వాత హఠాత్తుగా ఫిబ్రవరిలో అమ్మకాల వైపు మొగ్గు చూపడం సామాన్య ఇన్వెస్టర్లను కాస్త కంగారు పెడుతోంది. గతంలో ఏప్రిల్ 2023లో మాత్రమే ఇలాంటి అమ్మకాలు కనిపించాయి, మళ్లీ ఇప్పుడే అటువంటి పరిస్థితి తలెత్తింది.

మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాలు జరుపుతున్నాయని ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్ పతనం అవుతుందనడానికి సంకేతం కాదని, కేవలం ఒక స్ట్రాటజీ మాత్రమేనని వారు విశ్లేషిస్తున్నారు. చాలా కాలంగా పెరిగిన షేర్ల నుంచి లాభాలను స్వీకరించడం ఒక కారణం. సరిగా పనిచేయని షేర్ల నుంచి బయటకు వచ్చి, పటిష్టంగా ఉన్న లార్జ్-క్యాప్ షేర్లలోకి పెట్టుబడులను మళ్లించడం జరుగుతోంది. గతంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మిన షేర్లను మన దేశీ ఫండ్స్ కొన్నాయి. ఇప్పుడు వాటిని సర్దుబాటు చేసుకుంటున్నాయి.

పెట్టుబడిదారుల చూపు ఎటువైపు?

ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో మార్పుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వైవిధ్యపరుస్తున్నారు. కేవలం ఈక్విటీలకే పరిమితం కాకుండా.. గోల్డ్ ఈటీఎఫ్, బాండ్లు, హైబ్రిడ్ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 500 సూచీ తన ఏడాది గరిష్ట స్థాయి నుంచి దాదాపు 3.4 శాతం తక్కువలో ట్రేడ్ అవుతోంది. ఈ సమయంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న రూ.40 లక్షల కోట్ల ఆస్తులలో రూ.4,100 కోట్లు అమ్మడం అనేది చాలా చిన్న విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News