Hyundai Verna : వచ్చేస్తోంది సరికొత్త హ్యుందాయ్ వెర్నా..లుక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

Update: 2026-02-14 11:15 GMT

Hyundai Verna : సెడాన్ కార్ల ప్రపంచంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన హ్యుందాయ్ వెర్నా, ఇప్పుడు మళ్లీ తన పూర్వ వైభవాన్ని దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్ డిజైన్‌పై మిశ్రమ స్పందన రావడంతో, అమ్మకాల్లో వెర్నా కాస్త వెనకబడింది. ముఖ్యంగా ఫోక్స్‌వ్యాగన్ వర్చుస్, స్కోడా స్లావియా వంటి పోటీదారుల ధాటికి తట్టుకుని నిలబడేందుకు హ్యుందాయ్ ఇప్పుడు వెర్నా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ముస్తాబు చేస్తోంది. హ్యుందాయ్ వెర్నా అంటేనే స్టైల్, పర్ఫార్మెన్స్. అయితే జనవరి 2026లో వెర్నా కేవలం 1,000 యూనిట్ల లోపు అమ్మకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న మోడల్ లుక్స్ అందరికీ నచ్చకపోవడమే. అందుకే హ్యుందాయ్ వేగంగా స్పందించి, టెస్టింగ్ దశలో ఉన్న కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త కారులో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నాయని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది.

కొత్త వర్నా ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం చాలా ప్రీమియంగా ఉండబోతోంది. స్టీరింగ్ వీల్‌పై పాత హ్యుందాయ్ లోగోకు బదులుగా, సరికొత్త మోర్స్ కోడ్ గుర్తులను ఏర్పాటు చేశారు. డాష్‌బోర్డ్‌పై 10.25 అంగుళాల భారీ డ్యూయల్ స్క్రీన్ డిస్ప్లే సెటప్ ఉండనుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కేబిన్ అంతటా అల్యూమినియం ఫినిషింగ్‌తో కూడిన టచ్ ఉండటం వల్ల ఇది విలాసవంతమైన ఫీలింగ్‌ను ఇస్తుంది.

ముందు భాగంలో హారిజన్ ఎల్ఈడీ బార్ అలాగే కొనసాగుతున్నప్పటికీ, ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌లో కీలక మార్పులు చేశారు. కొత్త బంపర్, సిల్వర్ యాక్సెంట్స్‌తో కారు లుక్ మరింత అగ్రెసివ్‌గా మారింది. ముఖ్యంగా టర్బో వేరియంట్లలో స్కర్టింగ్ లాంటి సిల్వర్ ఫినిషింగ్ ఉండబోతోంది. అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చి, కారుకు ఒక ఫ్రెష్ లుక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది హ్యుందాయ్. టెయిల్ ల్యాంప్స్ డిజైన్ దాదాపు పాత దానిలాగే ఉన్నా, కొన్ని చిన్న చిన్న మార్పులు మెరిపిస్తున్నాయి.

వెర్నా ఎప్పుడూ ఫీచర్ల విషయంలో వెనకడుగు వేయదు. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో కూడా 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS (Advanced Driver Assistance System), ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెదరెట్ సీట్లు కారు లోపల కూర్చున్న వారికి విలాసవంతమైన అనుభవాన్ని ఇస్తాయి.

ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 PS పవర్), వేగం ఇష్టపడే వారి కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 PS పవర్) ఆప్షన్లు ఉన్నాయి. ధర విషయానికి వస్తే, ప్రస్తుతం వెర్నా రూ.10.79 లక్షల నుంచి రూ.17.13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ కూడా దాదాపు ఇదే ధరలో, ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News