Ultra Rich Travel : సముద్రంపై స్వర్గం..ఒక్క రాత్రి బసకు రూ.26 లక్షలా? అమన్ క్రూయిజ్ రేట్లు చూస్తే మతిపోవాల్సిందే.
Ultra Rich Travel : ప్రపంచంలో విలాసవంతమైన ప్రయాణాల అర్థమే మారిపోతోంది. ఒకప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లు అంటేనే గొప్పగా చెప్పుకునే వారు, కానీ ఇప్పుడు కోటీశ్వరుల చూపు సముద్రం మీద తేలియాడే విలాసవంతమైన సూపర్ యాట్ల వైపు మళ్లింది. ప్రముఖ లగ్జరీ హోటల్ చైన్ అమన్ గ్రూప్ తాజాగా ప్రవేశపెట్టిన అమన్ ఎట్ సీ ప్రాజెక్ట్ ధరలు వింటే సామాన్యులే కాదు, శ్రీమంతులు కూడా నోరెళ్లబెడుతున్నారు. కేవలం ఒక్క రాత్రికి ఈ క్రూయిజ్‌లో మీరు చెల్లించాల్సిన ధర అక్షరాలా రూ.26 లక్షలు.
అమన్ గ్రూప్ తీసుకొచ్చిన ఈ అమన్‌గతి క్రూయిజ్ కేవలం ఒక పడవ కాదు, సముద్రం మీద తేలియాడే ఒక అద్భుతం. సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే సూపర్-ప్రీమియం సూట్లు ఇందులో ఉన్నాయి. ఈ గదుల్లో వ్యక్తిగత విర్ల్‌పూల్, ప్రైవేట్ ఎలివేటర్ వంటి రాజభోగాలు ఉంటాయి. ఐదు రాత్రుల సాధారణ ప్యాకేజీ ప్రారంభ ధరనే దాదాపు రూ.32 లక్షల (38,500 డాలర్లు) నుంచి మొదలవుతుండగా, టాప్ ఎండ్ సూట్లు ఒక్క రాత్రికి రూ.26 లక్షల వరకు పలుకుతున్నాయి.
ఈ క్రూయిజ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో వందలాది మందిని ఎక్కించుకోరు. కేవలం 94 మంది అతిథులకు మాత్రమే చోటు ఉంటుంది. దాదాపు 700 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,800 కోట్లు) ఖర్చుతో తయారైన ఈ సూపర్‌యాట్‌లో రెండు హెలిప్యాడ్‌లు, ఐవీ థెరపీతో కూడిన స్పా, పర్సనల్ కన్సీర్జ్ సర్వీస్ ఉంటాయి. మీరు కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లేదా మొనాకో గ్రాండ్ ప్రిక్స్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లకు వెళ్లాలనుకుంటే, అక్కడి వీఐపీ పాస్‌లను కూడా ఈ క్రూయిజ్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. 2027 నుంచి ఈ క్రూయిజ్ మధ్యధరా సముద్రం రూట్లలో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
అయితే ఇంత భారీ ధరలు వసూలు చేస్తున్నప్పటికీ, కొన్ని ముఖ్యమైన రెస్టారెంట్లు, ఖరీదైన వైన్ ఖర్చులను ప్యాకేజీలో చేర్చకపోవడంపై ప్రయాణ ఏజెంట్లు పెదవి విరుస్తున్నారు. కానీ అమన్ గ్రూప్ సీఈఓ వ్లాదిస్లావ్ డోరోనిన్ మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. "మేము కేవలం క్రూయిజ్ టిక్కెట్లను అమ్మడం లేదు, సముద్రం మీద అమన్ హోటల్ ఇచ్చే అద్భుతమైన అనుభవాన్ని అమ్ముతున్నాం" అని ఆయన పేర్కొన్నారు. కేవలం అమన్ మాత్రమే కాదు, ఫోర్ సీజన్స్, రిట్జ్-కార్ల్టన్ వంటి ఇతర దిగ్గజ సంస్థలు కూడా ఈ అల్ట్రా-లగ్జరీ విభాగంలోకి పోటీపడుతున్నాయి. మరి ఇంత భారీ ధరలతో ఈ బిజినెస్ మోడల్ ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.