Car Sales : కార్ల కంపెనీల విశ్వరూపం.. అమ్మకాల సునామీలో కొట్టుకుపోతున్న పాత రికార్డులు.

Update: 2026-02-03 07:30 GMT

Car Sales : 2026 సంవత్సరం భారత ఆటోమొబైల్ రంగానికి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. జనవరి నెలలో కార్ల అమ్మకాలు సునామీని సృష్టించాయి. మారుతి సుజుకి నుంచి మహీంద్రా వరకు ప్రతి కంపెనీ తమ పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త చరిత్ర సృష్టించాయి. ముఖ్యంగా ఎస్‌యూవీ మోడళ్లకు పెరుగుతున్న క్రేజ్ కంపెనీల ఖజానాను నింపేస్తోంది. కేవలం ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా సుమారు 4.55 లక్షల కార్లు అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశీయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జనవరి 2026లో మారుతి సుజుకి ఏకంగా 1,74,529 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. టాప్ 10 అత్యధిక విక్రయాలు కలిగిన కార్ల జాబితాలో మారుతికి చెందిన 6 మోడళ్లు ఉండటం విశేషం. ముఖ్యంగా కొత్తగా వచ్చిన డిజైర్, అలియాస్ విక్టోరిస్‌తో పాటు అల్ట్రా మోడ్రన్ స్విఫ్ట్, బ్రెజ్జా కార్లకు కస్టమర్లు బ్రహ్మరథం పట్టారు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు పెరగడమే కాకుండా, కంపెనీ చరిత్రలో ఇదే అత్యుత్తమ జనవరిగా నిలిచిపోయింది.

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 46.1% వృద్ధిని నమోదు చేస్తూ 70,222 కార్లను విక్రయించింది. టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ ఎస్‌యూవీలు సేల్స్ లో అదరగొట్టాయి. నెక్సాన్ ఎస్‌యూవీ ఏకంగా 10 లక్షల మైలురాయిని దాటగా, పంచ్ ఎస్‌యూవీ కేవలం 4 ఏళ్లలోనే 7 లక్షల యూనిట్ల మార్కును అందుకుని దేశంలోనే అత్యంత వేగంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది. ఈ రెండు కార్ల వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా ఉండటం వీటి క్రేజ్‌కు నిదర్శనం.

ఎస్‌యూవీల స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా జనవరిలో 63,510 యూనిట్ల విక్రయాలతో 25% పైగా వృద్ధిని సాధించింది. స్కార్పియో, బొలెరో మోడళ్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక హ్యుందాయ్ మోటార్స్ విషయానికొస్తే, కొత్తగా లాంచ్ అయిన క్రెటా, వెన్యూ మోడళ్లు కంపెనీకి పెద్ద ప్లస్ అయ్యాయి. క్రెటా ఒక్కటే 17,921 యూనిట్ల అమ్మకాలతో ఎస్‌యూవీ విభాగంలో టాప్‌లో నిలిచింది. వెన్యూ కారు కూడా తన కెరీర్‌లోనే అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను ఈ జనవరిలో నమోదు చేయడం గమనార్హం.

ప్రస్తుతం కార్ల మార్కెట్‌లో సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ కంటే కూడా ఎస్‌యూవీలకే ప్రాధాన్యత పెరుగుతోంది. కంఫర్ట్, గ్రౌండ్ క్లియరెన్స్, రోడ్ ప్రెజెన్స్ కారణంగా యువత, ఫ్యామిలీస్ ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. జనవరిలో అమ్ముడైన మొత్తం కార్లలో దాదాపు 50% పైగా ఎస్‌యూవీలే కావడం విశేషం. ఇదే జోరు కొనసాగితే 2026 ఏడాది ఆటోమొబైల్ రంగానికి గోల్డెన్ ఇయర్ కాబోతోంది.

Tags:    

Similar News