Bajaj Pulsar 150 : కుర్రాళ్ల గుండెల్లో మళ్ళీ పల్సర్ మోత..కొత్త లుక్‌తో అదరగొడుతున్న బజాజ్ 150.

Update: 2025-12-26 05:45 GMT

Bajaj Pulsar 150 : భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్ అంటే గుర్తొచ్చే పేర్లలో బజాజ్ పల్సర్ ముందుంటుంది. దశాబ్దాలుగా కుర్రాళ్ల కలల బైక్ గా ఉన్న పల్సర్ 150ని బజాజ్ కంపెనీ సరికొత్త హంగులతో అప్‌డేట్ చేసింది. పాత మోడల్‌కు స్వస్తి చెబుతూ 2026 మోడల్ రేంజ్‌లో భాగంగా ఈ బైక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చింది. ఈ కొత్త పల్సర్ 150 ఇప్పుడు మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1,08,772 (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ మోడల్ ధర రూ.1,15,481 వరకు ఉంది. చూడటానికి సింపుల్ గా ఉన్నా, పెర్ఫార్మెన్స్ లో స్పోర్ట్స్ బైక్ కు ఏమాత్రం తీసిపోని విధంగా దీనిని తీర్చిదిద్దారు.

కొత్త పల్సర్ 150 సైజులో పాత దానిలాగే ఉన్నప్పటికీ, లుక్ పరంగా మాత్రం చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. బజాజ్ ఈ బైక్ కు కొత్త కలర్ ఆప్షన్లు, అదిరిపోయే గ్రాఫిక్స్‌ను జోడించింది. అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఇందులో ఇప్పుడు LED హెడ్‌లైట్, LED ఇండికేటర్లను అమర్చారు. దీనివల్ల బైక్ మరింత ప్రీమియం లుక్‌ను సంతం చేసుకుంది. రాత్రి వేళ ప్రయాణించేటప్పుడు రోడ్డుపై వెలుతురు మరింత స్పష్టంగా ఉండేలా ఈ లైటింగ్ సహాయపడుతుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్స్‌తో ఈ బైక్ మజిల్ డిజైన్ ను అలాగే కొనసాగిస్తోంది.

బైక్ రూపం మారినా, లోపల ఉండే ఇంజిన్ మాత్రం అదే నమ్మకమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో 149.5 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 13.8 bhp పవర్, 13.25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్.. లీటరుకు సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సిటీ రోడ్లపై హాయిగా దూసుకెళ్లడానికి ఈ ఇంజిన్ పవర్ సరిగ్గా సరిపోతుంది. మార్కెట్లో దీనికి పోటీగా హోండా సిబి యూనికార్న్, టీవీఎస్ అపాచీ RTR 160 వంటి బైక్‌లు ఉన్నప్పటికీ, పల్సర్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

పల్సర్ 150 బైక్ 5 వేరియంట్లు, 7 రంగుల్లో లభిస్తోంది. ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, చాలా మందికి ఒక ఎమోషన్. తక్కువ మెయింటెనెన్స్, మంచి రీసేల్ వాల్యూ, ఎప్పుడూ ట్రెండీగా ఉండే లుక్ దీనిని హాట్ కేక్ లా అమ్ముడయ్యేలా చేస్తాయి. స్ట్రీట్ బైక్ కేటగిరీలో ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న 150సీసీ బైక్ ఇదే కావడం విశేషం. ఇప్పుడు కొత్త LED ఫీచర్లతో రావడం వల్ల పాత పల్సర్ అభిమానులతో పాటు కొత్త తరం యువతను కూడా ఇది ఇట్టే ఆకర్షించనుంది.

Tags:    

Similar News