Mahindra : కార్ల కోసం వెయిటింగ్ ఇక ఉండదు..మహీంద్రా అదిరిపోయే గ్రోత్ ప్లాన్.
Mahindra : మహీంద్రా ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థార్, ఎక్స్‌యూవీ 700 వంటి కార్ల కోసం కస్టమర్లు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అయితే, ఈ వెయిటింగ్ పీరియడ్‌కు చెక్ పెట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా నడుం బిగించింది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా తన ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచాలని నిర్ణయించింది. మహీంద్రా ఆటో, ఫార్మ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీ తన ఉత్పత్తి వేగాన్ని అమాంతం పెంచనుంది. మహారాష్ట్రలోని చాకన్ మరియు నాసిక్ ప్లాంట్లలో పెట్రోల్, డీజిల్ (ICE) ఇంజిన్ కార్ల ఉత్పత్తిని నెలకు 3,000 నుంచి 5,000 యూనిట్లు పెంచబోతున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల కోసం మరో 4,000 యూనిట్ల అదనపు సామర్థ్యాన్ని జోడించనున్నారు. అంటే మొత్తం మీద నెలకు 7,000 కొత్త కార్లు మార్కెట్లోకి ఎక్కువగా రానున్నాయి. దీనివల్ల కస్టమర్లకు కార్ల డెలివరీ చాలా త్వరగా జరుగుతుంది.
2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలు మహీంద్రాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కంపెనీ నికర లాభం ఏకంగా 46.97 శాతం పెరిగి రూ. 4,674.64 కోట్లకు చేరింది. ఎస్‌యూవీల విక్రయాల్లో 26 శాతం వృద్ధి నమోదవ్వగా.. రెవెన్యూ మార్కెట్ వాటాలో 24.1 శాతంతో మహీంద్రా టాప్ పొజిషన్‌లో ఉంది. కేవలం కార్లే కాకుండా, ట్రాక్టర్ల విభాగంలో 23 శాతం, లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCV) విభాగంలో 20 శాతం వృద్ధిని కంపెనీ సొంతం చేసుకుంది. నాగపూర్‌లో కొత్తగా భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పనులు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ పథకానికి మహీంద్రా XEV 9e శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలు అర్హత సాధించాయి. ఇది కంపెనీకి ఆర్థికంగా పెద్ద ఊరట. అయితే, ముడి సరుకుల ధరలు పెరగడం, విలువైన లోహాల కొరత, విదేశీ కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా కార్ల ధరలను ఒక శాతం వరకు పెంచే ఆలోచనలో కంపెనీ ఉంది. ధరలు కొంచెం పెరిగినా, లేటెస్ట్ ఫీచర్లు,వేగవంతమైన డెలివరీ వల్ల కస్టమర్లు మహీంద్రా వైపు మొగ్గు చూపుతారని కంపెనీ ఆశాభావంతో ఉంది.