Bharat Taxi App : ఓలా, ఉబర్‌లకు టాటా చెప్పే టైమ్ వచ్చేసింది..మార్కెట్‌లోకి భారత్ టాక్సీ.

Update: 2026-02-05 08:00 GMT

Bharat Taxi App : దేశీయ క్యాబ్ సేవల రంగంలో ఇవాళ ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థల ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెడుతూ, దేశంలోనే మొట్టమొదటి సహకార రవాణా వ్యవస్థ భారత్ టాక్సీ యాప్ నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా నేడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'భారత్ టాక్సీ' యాప్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది కేవలం మరో క్యాబ్ యాప్ మాత్రమే కాదు, ఇది ఒక సహకార సంస్థ. తొలుత ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అందుబాటులోకి రానున్న ఈ సేవలను త్వరలోనే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. ఈ యాప్ ద్వారా బైక్, ఆటో, కార్లు.. ఇలా మూడు రకాల ఆప్షన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

భారత్ టాక్సీ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే దాని డ్రైవర్-ఓనర్‌షిప్ మోడల్. ప్రైవేట్ యాప్‌లలో డ్రైవర్లు సంపాదించిన దాంట్లో అధిక శాతం కమిషన్ రూపంలో కంపెనీకే పోతుంది. కానీ ఇక్కడ డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. పైగా ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరే ప్రతి డ్రైవర్‌కు సహకార సంస్థలో 5 షేర్లు కేటాయిస్తారు. అంటే డ్రైవర్లు ఇక్కడ కేవలం పనివారు మాత్రమే కాదు, ఆ సంస్థలో వాటాదారులు కూడా. వారు కేవలం ఒక కనిష్ట సభ్యత్వ రుసుము చెల్లిస్తే సరిపోతుంది.

ప్రయాణికులకు భారత్ టాక్సీ ఒక గొప్ప ఊరటనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే సుమారు 30 శాతం తక్కువ ధరకే రైడ్లు అందిస్తామని సంస్థ ప్రకటించింది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇందులో సర్జ్ ప్రైసింగ్(డిమాండ్ పెరిగినప్పుడు ధర పెంచడం) ఉండదు. వర్షం కురిసినా, ట్రాఫిక్ జామ్ అయినా, అర్ధరాత్రి అయినా సరే.. కిరాయి ముందుగానే నిర్ణయించబడుతుంది. దీనివల్ల ప్రయాణికులకు పారదర్శకమైన, చౌకైన ప్రయాణం లభిస్తుంది.

డ్రైవర్ల సామాజిక భద్రతకు కూడా ఈ సంస్థ పెద్దపీట వేసింది. భారత్ టాక్సీలో నమోదైన ప్రతి డ్రైవర్‌కు రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, అలాగే రూ.5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా, భవిష్యత్తులో డ్రైవర్లు తమ సొంత వాహనాలను కొనుగోలు చేయడానికి సులభమైన వాయిదాలలో తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చే సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. దీనివల్ల డ్రైవర్లు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించవచ్చు.

జూన్ 2025లో ఈ సంస్థ స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 3 లక్షల మంది డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరారు. యాప్ లాంచ్ కాకముందే లక్షకు పైగా యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. ప్రైవేట్ కంపెనీల దోపిడీతో విసిగిపోయిన డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరూ భారత్ టాక్సీ వైపు ఆశగా చూస్తున్నారు. ఈ సహకార నమూనా సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా రవాణా రంగం తలరాతే మారిపోనుంది.

Tags:    

Similar News