Xpeng G7 Hybrid SUV : కార్ కాదు బాబోయ్..మినీ పవర్ హౌజ్ ఏకంగా 1700 కిమీలా..ఈ రేంజ్ ఏంటి స్వామి.
Xpeng G7 Hybrid SUV : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్‌పెంగ్ మోటార్స్ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ ఎస్‌యూవీ G7లో హైబ్రిడ్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈ కారు రేంజ్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేసి, బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 1704 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది.
సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఎక్స్‌పెంగ్ సంస్థ ఎక్స్‌టెండెడ్ రేంజ్ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ G7 ఎస్‌యూవీలో 55.8 kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీతో పాటు 60 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఇందులో ఉండే 1.5 లీటర్ల చిన్న పెట్రోల్ ఇంజిన్ చక్రాలను తిప్పడానికి కాకుండా, కేవలం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీనివల్ల కారు మైలేజీ ఊహించని రీతిలో పెరుగుతుంది. కేవలం బ్యాటరీపైనే ఈ కారు 430 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
ధర మరియు ఇతర వేరియంట్లు ఈ అద్భుతమైన ఎస్‌యూవీని కంపెనీ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర సుమారు 28,000 డాలర్లు (దాదాపు రూ.23.5 లక్షలు) గా నిర్ణయించింది. G7తో పాటు ఎక్స్‌పెంగ్ తన P7+ సెడాన్ మోడల్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఈ సెడాన్ కూడా ఒకసారి ఫుల్ చేస్తే 1,550 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీని ధర సుమారు రూ.22.6 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గతేడాది ఎక్స్‌పెంగ్ ఏకంగా 4.29 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి తన పట్టును చాటుకుంది.
హ్యూమనాయిడ్ రోబో ఐరన్ కేవలం కార్లే కాకుండా, ఎక్స్‌పెంగ్ సంస్థ రోబోటిక్స్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఐరన్ పేరుతో ఒక అడ్వాన్స్‌డ్ హ్యూమనాయిడ్ రోబోను కంపెనీ తయారు చేసింది. ఇది మనుషుల లాగే నడుస్తూ, క్లిష్టమైన పనులను చేయగలదు. ఇందులో వాడిన ట్యూరింగ్ ఏఐ చిప్ సెకనుకు 3000 ట్రిలియన్ల ఆపరేషన్లను చేయగలదు. ప్రస్తుతం ఈ రోబోలను కంపెనీ తన కార్ల తయారీ యూనిట్లలో వినియోగిస్తోంది. 2028 నుంచి 2038 మధ్య కాలంలో ఈ రోబోలు మన నిత్య జీవితంలో భాగంగా మారుతాయని ఎక్స్‌పెంగ్ నమ్ముతోంది.