Tata Nexon : భారత రోడ్లపై టాటా సునామీ.. క్రెటా, స్కార్పియోల కోటలను కూల్చేసిన నెక్సాన్.
Tata Nexon : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకప్పుడు రారాజుల్లా వెలిగిన భారీ ఎస్‌యూవీలకు ఇప్పుడు గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా 2026 జనవరి నెల కార్ల అమ్మకాల గణాంకాలు చూస్తుంటే, మధ్యతరగతికి ఇష్టమైన బడ్జెట్ ఎస్‌యూవీలు.. ఖరీదైన క్రెటా, స్కాార్పియో వంటి మోడళ్లకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం రూ.8 లక్షల బడ్జెట్ శ్రేణిలో ప్రారంభమయ్యే కార్లు ఇప్పుడు సేల్స్ చార్టులో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి.2026 జనవరి నెలలో భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్ 28.49% వృద్ధిని సాధించింది. టాప్ 10 కార్ల మొత్తం అమ్మకాలు 1.57 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ రేసులో టాటా నెక్సాన్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్లు అన్నీ కలిపి ఏకంగా 23,365 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 51% వృద్ధి. దీని వెనుకే టాటా పంచ్ రూ.8 లక్షల బడ్జెట్ విభాగంలో 19,257 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్-4 మీటర్ ఎస్‌యూవీలకు భారతీయులు ఎంతలా ఫిదా అవుతున్నారో ఈ గణాంకాలే నిదర్శనం.
మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగొందిన హ్యుందాయ్ క్రెటా ఈసారి మూడో స్థానానికి పడిపోయింది. 17,921 యూనిట్ల అమ్మకాలు సాధించినప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే 3.24% స్వల్ప తగ్గుదల కనిపించింది. అటు భారీ ఎస్‌యూవీగా పేరున్న మహీంద్రా స్కార్పియో (స్కార్పియో-ఎన్, క్లాసిక్ కలిపి) 15,542 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. స్కార్పియో అమ్మకాల్లో వృద్ధి కేవలం 0.65% మాత్రమే ఉండటం గమనార్హం. అంటే భారీ కార్ల కంటే ఫ్యామిలీకి సరిపోయే కాంపాక్ట్ కార్లకే జనం జై కొడుతున్నారు.
ఈసారి టాప్ 10 జాబితాలో ఒక కొత్త పేరు వినిపించింది.. అదే మారుతి విక్టోరిస్. లాంచ్ అయిన తొలి జనవరిలోనే 15,240 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. మారుతి బ్రెజ్జా 17,486 యూనిట్లతో నాలుగో స్థానంలో తన పట్టును నిలుపుకుంది. ఇక కియా సోనెట్ ఏకంగా 52.88% వృద్ధిని సాధించి పదో స్థానంలో నిలవగా, గ్రామీణ మార్కెట్లలో తిరుగులేని నేతగా మహీంద్రా బొలెరో (11,841 యూనిట్లు) తన హవాను కొనసాగిస్తోంది. మారుతి ఫ్రాంక్స్ అమ్మకాలు మాత్రం ఈసారి 12% తగ్గుముఖం పట్టడం గమనార్హం.