Yamaha : సింగిల్ ఛార్జ్ పై 169 కిమీ రేంజ్..భారత రోడ్లపై యమహా ఎలక్ట్రిక్ సునామీ.
Yamaha : ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా (Yamaha) ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06ని మార్కెట్లో విడుదల చేసి ఓలా, ఏథర్ వంటి కంపెనీలకు సవాల్ విసిరింది. అదిరిపోయే లుక్స్, నమ్మకమైన రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్ ఇప్పుడు ఈవీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 169 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇండియా యమహా మోటార్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06ని అధికారికంగా లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,67,600గా నిర్ణయించారు. ప్రస్తుతానికి ఈ స్కూటర్ యమహాకు చెందిన బ్లూ స్క్వేర్ ప్రీమియం డీలర్‌షిప్‌లలో మాత్రమే లభిస్తుంది. కేవలం బ్లూయిష్ వైట్ రంగులో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్, చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.
బ్యాటరీ, పవర్ సామర్థ్యం
ఈ స్కూటర్‌లో 4kWh సామర్థ్యం కలిగిన ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి తోడు IPMSM మోటార్‌ను వాడటం వల్ల ఇది 6.7 kW గరిష్ట శక్తిని, 26 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే సిటీ రోడ్లపై ఎంతటి ట్రాఫిక్ ఉన్నా సునాయాసంగా దూసుకుపోవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 79 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే IDC సర్టిఫైడ్ రేంజ్ ప్రకారం 169 కిలోమీటర్లు వెళ్తుంది. ఇది ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారికి లేదా సిటీలో తిరిగేవారికి గొప్ప ఆప్షన్.
ఛార్జింగ్, వారంటీ వివరాలు
సాధారణ ఇంటి సాకెట్ ద్వారానే ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. సున్నా నుంచి వంద శాతం ఛార్జింగ్ కావడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. బ్యాటరీపై కంపెనీ 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తోంది. మోటార్ మరియు బ్యాటరీలకు IP67 రేటింగ్ ఉండటం వల్ల వర్షాకాలంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపవచ్చు. మిగిలిన ఎలక్ట్రానిక్ పార్ట్స్ అన్నిటికీ IP65 రేటింగ్ ఇచ్చారు.
స్మార్ట్ ఫీచర్లు.. మూడు రైడింగ్ మోడ్స్
రైడర్ల సౌలభ్యం కోసం ఇందులో Eco, Standard, Power అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. దీనివల్ల మనకు నచ్చిన విధంగా వేగాన్ని, బ్యాటరీ లైఫ్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఇరుకైన చోట్ల పార్కింగ్ కోసం రివర్స్ మోడ్ కూడా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే.. కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. Yamaha Motor Connect R యాప్ ద్వారా మీ స్కూటర్ డేటాను రియల్ టైమ్‌లో ఫోన్‌లో చూడవచ్చు.
స్టోరేజ్, సేఫ్టీ
సీటు కింద 24.5 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇందులో హెల్మెట్ లేదా రోజువారీ సామాన్లను సులభంగా పెట్టుకోవచ్చు. భద్రత కోసం ముందు, వెనుక 200 mm డిస్క్ బ్రేక్‌లతో పాటు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ను ఏర్పాటు చేశారు. సిటీ రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగడానికి సస్పెన్షన్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. మొత్తానికి యమహా తన బ్రాండ్ వాల్యూకు తగ్గట్టుగా ఒక పక్కా ప్లానింగ్‌తో ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టింది.