Airtel : నక్కతోక తొక్కిన భారతీ ఎయిర్‌టెల్.. రెండో త్రైమాసికంలో రూ.8,651 కోట్ల లాభం.

Update: 2025-11-04 08:15 GMT

Airtel : దేశీయ టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ప్రకటించి సంచలనం సృష్టించింది. అధిక ధరల ప్లాన్‌లను ఎంచుకునే స్మార్ట్‌ఫోన్ కస్టమర్‌లు, పోస్ట్-పెయిడ్ కనెక్షన్‌ల సంఖ్య పెరగడం వలన కంపెనీ ఏకంగా రూ.8,651 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం కంటే రెట్టింపు కంటే ఎక్కువ కావడం విశేషం.

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం ఏకంగా రూ.8,651 కోట్లకు చేరింది. గత ఏడాది 2024-25 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.4,153.4 కోట్లుగా ఉండేది.. అంటే లాభం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.

ఈ త్రైమాసికంలో కంపెనీ ఆపరేటింగ్ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇది 25.7 శాతం వృద్ధి చెంది రూ.52,145 కోట్లకు చేరింది, గత సంవత్సరం ఇది రూ.41,473.3 కోట్లుగా ఉండేది. కంపెనీ లాభాలు ఇంత భారీగా పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి: అధిక ధరల ప్లాన్‌లు తీసుకునే కస్టమర్‌లు, పోస్ట్-పెయిడ్ విభాగంలో వృద్ధి.

ఎయిర్‌టెల్ ప్రతి వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.233 ఉండగా, ఇప్పుడు సుమారు 10 శాతం పెరిగి రూ.256కు చేరింది. క్వాలిటీ కస్టమర్లపై దృష్టి పెట్టడం వలన, ఈ త్రైమాసికంలో కంపెనీకి 51 లక్షల మంది కొత్త స్మార్ట్‌ఫోన్ కస్టమర్‌లు చేరారు. అలాగే, పోస్ట్ పెయిడ్ విభాగంలో కూడా అత్యధికంగా 10 లక్షల కొత్త కస్టమర్ల వృద్ధి నమోదైంది.

భారతీ ఎయిర్‌టెల్ కేవలం భారతీయ మార్కెట్‌లో మాత్రమే కాకుండా ఆఫ్రికా వ్యాపారంలో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచింది. ఎయిర్‌టెల్ ఆఫ్రికా వ్యాపారంలో ఈ త్రైమాసికంలో నికర లాభం పెరిగి రూ.969 కోట్లకు చేరుకుంది. స్థిర కరెన్సీ పరంగా ఆఫ్రికా వ్యాపారం ఆదాయ వృద్ధి 7.1 శాతం ఉండగా, భారతీయ రూపాయి పరంగా ఆఫ్రికా ఆదాయం దాదాపు 36 శాతం వృద్ధి చెంది రూ.13,679.5 కోట్లుగా నమోదైంది.

Tags:    

Similar News