UPI : యూపీఐ చరిత్రలోనే అతిపెద్ద మార్పు..ఇకపై రెప్పాపాటులోనే లావాదేవీలు.

Update: 2026-02-07 05:45 GMT

UPI : భారతదేశంలో టీ కొట్టు నుంచి పెద్ద షోరూమ్‌ల వరకు ఇప్పుడు అంతా స్కాన్ అండ్ పే ట్రెండే నడుస్తోంది. మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారిన యూపీఐని మరింత బలోపేతం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నడుం బిగించింది. నగదు రహిత లావాదేవీల్లో యూపీఐ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, దీని సాంకేతిక వ్యవస్థను మరింత ఆధునికీకరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఫిబ్రవరి ద్రవ్యోల్బణ పరపతి విధానం విడుదల చేసిన సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ కీలక విషయాలను వెల్లడించారు.

యూపీఐ వ్యవస్థను కేవలం తాత్కాలికంగా కాకుండా, సుదీర్ఘ కాలం పాటు పటిష్టంగా ఉండేలా చూడడమే ఆర్‌బీఐ లక్ష్యం. ప్రస్తుతం యూపీఐపై లావాదేవీల భారం విపరీతంగా పెరిగింది. పీక్ అవర్స్‌లో సర్వర్లు మొరాయించడం, పేమెంట్లు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు స్టేబిలిటీ, స్పీడ్, సెక్యూరిటీ అనే మూడు సూత్రాలతో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని గవర్నర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో రోజుకు వందల కోట్ల లావాదేవీలు జరిగినా తట్టుకునేలా ఈ సిస్టమ్‌ను తయారు చేస్తున్నారు.

యూపీఐ ప్రస్తుతం వినియోగదారులకు, వ్యాపారులకు దాదాపు ఉచితంగా లభిస్తోంది. బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు నిర్వహణ ఖర్చుల కోసం మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించాలని కోరుతున్నాయి. అయితే సుమారు 50 కోట్ల మంది యూపీఐ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలను అనుమతించలేదు. డిజిటల్ పేమెంట్స్ వల్ల కరెన్సీ ముద్రణ ఖర్చు తగ్గుతున్నందున, ప్రభుత్వం బడ్జెట్ ద్వారా బ్యాంకులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. 2026-27 బడ్జెట్‌లో తక్కువ మొత్తంలో జరిగే యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్ల ప్రోత్సాహకాన్ని కేటాయించింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికే యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.230 లక్షల కోట్లు దాటడం విశేషం. ఇది భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు నిదర్శనం. ఈ భారీ నెట్‌వర్క్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ నిరంతరం కృషి చేస్తోంది. సాంకేతికతలో మార్పులు చేయడం ద్వారా ఖాతాదారుల నమ్మకాన్ని పెంచడంతో పాటు, దేశీయ ఆర్థిక వ్యవస్థకు యూపీఐని అసలైన వెన్నెముకగా నిలబెట్టాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

Tags:    

Similar News