Budget 2026 : ఇన్వెస్టర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న టాక్స్ భారం.
Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక స్పష్టమైన ఊరటనిచ్చారు. షేర్ బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధానాన్ని మార్చడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద ఉన్న అదనపు నగదును షేర్ హోల్డర్లకు పంచడానికి రెండు మార్గాలు ఎంచుకుంటాయి. ఒకటి డివిడెండ్ ఇవ్వడం, రెండోది షేర్లను తిరిగి కొనుగోలు చేయడం (బైబ్యాక్). ఇప్పటివరకు బైబ్యాక్ ద్వారా వచ్చే లాభాన్ని డివిడెండ్ ఆదాయంగా చూసేవారు, దీనివల్ల గరిష్టంగా 30% వరకు పన్ను పడేది.
కానీ కొత్త నిబంధన ప్రకారం.. బైబ్యాక్ ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్ గా పరిగణిస్తారు. దీనివల్ల సాధారణ ఇన్వెస్టర్లకు పన్ను భారం భారీగా తగ్గుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 20%, లాంగ్ టర్మ్ అయితే కేవలం 12.5% పన్ను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే 30% కట్టాల్సిన చోట ఇప్పుడు సగానికంటే తక్కువ పన్నుతోనే పని అయిపోతుంది. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు దొరికిన పెద్ద విజయం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే, ఈ మార్పు వెనుక కంపెనీ ప్రమోటర్ల ట్యాక్స్ మాయాజాలాన్ని అరికట్టే వ్యూహం కూడా ఉంది. డివిడెండ్ ఇస్తే ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తుందని, చాలా కంపెనీలు బైబ్యాక్ మార్గాన్ని ఎంచుకుని పన్ను ఎగ్గొట్టేవి. అందుకే ప్రభుత్వం ప్రమోటర్లపై అదనపు పన్ను విధించింది. దీనివల్ల కార్పొరేట్ ప్రమోటర్లకు 22%, నాన్-కార్పొరేట్ ప్రమోటర్లకు 30% వరకు పన్ను పడుతుంది. దీనివల్ల కంపెనీలు అనవసరంగా బైబ్యాక్ చేయడం కంటే, ఆ డబ్బును పరిశోధన లేదా కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల మార్కెట్ లో మరింత పారదర్శకత వస్తుందని రెవెన్యూ సెక్రటరీ అరవింద్ శ్రీవాత్సవ స్పష్టం చేశారు.