Bitcoin Crashes : కుప్పకూలిన క్రిప్టో మార్కెట్.. భారీ నష్టాల పాలైన ఇన్వెస్టర్లు.
Bitcoin Crashes : 2025 సంవత్సరంలో క్రిప్టో మార్కెట్‌లో అతిపెద్ద క్షీణత ఒకటి నమోదైంది. అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర జూన్ తర్వాత తొలిసారిగా $100,000 (సుమారు రూ.83 లక్షలు) కంటే దిగువకు పడిపోయింది. ఇటీవల రికార్డు గరిష్టం నుంచి దాదాపు 20% పతనం కావడంతో ప్రస్తుతం దీన్ని బేర్ మార్కెట్ దశలోకి వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ భారీ క్షీణత కారణంగా మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ $1 ట్రిలియన్ డాలర్ కంటే ఎక్కువ తగ్గిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ పతనాన్ని కొందరు తాత్కాలికంగా భావిస్తుండగా, పెద్ద పెట్టుబడిదారులు మాత్రం దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశంగా చూస్తున్నారు.
బిట్‌కాయిన్ ధర రికార్డు స్థాయి నుంచి దాదాపు 20% పడిపోయి, జూన్ తర్వాత మొదటిసారిగా $100,000 మార్కు కంటే దిగువకు చేరుకుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పతనానికి ప్రధాన కారణం బిట్‌కాయిన్ ప్రాథమిక బలం తగ్గడం కాదు, మార్కెట్‌లో ఉన్న అధిక లీవరేజ్ ట్రేడింగ్. అప్పులపై ట్రేడింగ్ చేయడం వల్ల మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరిగాయి.
రోజుకు సుమారు 3 లక్షల ట్రేడర్ల ఖాతాలు లిక్విడేట్ (బలవంతంగా మూసివేయడం) అవుతున్నాయి. అక్టోబర్ 10న $20 బిలియన్ల భారీ లిక్విడేషన్ జరిగింది, ఇది ధర మరింత వేగంగా పడిపోవడానికి దారితీసింది. డేటా సంస్థ గ్లాస్‌నోడ్ ప్రకారం.. బిట్‌కాయిన్ $109,000 కీలక సపోర్ట్ లెవల్ కోల్పోయి, ప్రస్తుతం $103,500 సమీపంలో ట్రేడవుతోంది. తదుపరి ముఖ్యమైన సపోర్ట్ స్థాయి $99,000 వద్ద ఉంది.
షార్ట్-టర్మ్ ట్రేడర్‌లు నష్టాలను అంగీకరించి అమ్మకాలు చేస్తున్నప్పటికీ, పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు మాత్రం కొనుగోళ్లు పెంచుతున్నారు. క్రిప్టోక్వాంట్ డేటా ప్రకారం, ఇటీవల కొనుగోలు చేసిన షార్ట్-టర్మ్ ట్రేడర్‌లు భారీ నష్టాలకు అమ్ముతున్నారు. ఒక్క రోజులోనే దాదాపు 30,000 బిట్‌కాయిన్‌లు నష్టానికి ఎక్స్ఛేంజ్‌లలో డిపాజిట్ అయ్యాయి, ఇది మార్కెట్‌లో భయాన్ని పెంచింది. ఈ పతనం జరుగుతున్నప్పటికీ పెద్ద ఆర్థిక సంస్థలు, పెట్టుబడి సంస్థలు బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. బైనాన్స్ డేటా ప్రకారం, చాలా మంది ఇన్వెస్టర్లు తక్కువ ధరల వద్ద లేదా ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయడం వల్ల, వారు ప్రస్తుతం పెద్ద నష్టాల్లో లేరు.
మార్కెట్ పడిపోయినప్పటికీ, గత 30 రోజుల్లో బిట్‌కాయిన్ ETF లలో 50,000 బిట్‌కాయిన్‌ల పెట్టుబడి వచ్చింది. ఇది పెద్ద ఇన్వెస్టర్లకు బిట్‌కాయిన్‌పై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా సూచిస్తోంది. మార్కెట్ విశ్లేషకులు ఈ పతనాన్ని తాత్కాలికంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రికవరీపై ఆశలు వ్యక్తం చేస్తున్నారు.