ఇటీవల ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు రీఛార్జ్ ప్లాన్ల రేట్లను భారీగా పెంచాయి. దశంలో అగ్రగామి టెలికం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా 11-25 శాతం వరకు టారిఫ్ ఛార్జీలు పెంచాయి. దీంతో ఆగ్రహించిన కస్టమర్లు టారిఫ్ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. బీఎస్ఎన్ఎల్ కీ ఘర్ వాపసీ, బైకాట్ జియో, బైకాట్ ప్రైవేట్ మొబైల్ కంపెనీలు.. ఇలా పలు రకాలుగా సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు.
ప్రైవేట్ టెలికం కంపెనీలు భారీగా టారిఫ్ లు పెంచడంతో మొబైల్ వినియోగదారులు భారీ ఎత్తున బీఎస్ఎన్ఎల్ సర్వీస్ కి మారిపోతున్నారు. కొత్త కస్టమర్లు కూడా బీఎస్ఎన్ఎల్ సర్వీస్లు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జులై 3 నుంచి ఈ సంస్థలు పెంచిన టారిఫ్ లు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర టెలికం కస్టమర్లు 2,50,000 మంది బీఎస్ఎన్ఎల్ కు మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎస్ పీ)ని ఉపయోగించి మారిపోయారు. వీరితో పాటు బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోల్చితే చాలా తక్కువ టారిఫ్ లోనే వార్షిక ప్లాన్లను ప్రకటించింది. దీంతో ఈ కాలంలో బీఎస్ఎన్ఎలకు 25 లక్షల కొత్త కస్టమర్లు చేరారు.
రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ 365 రోజుల కాల వ్యవధితో ఉన్న ప్లాన్స్ ధర 3,599 రూపాయలుగా ఉన్నాయి. గతంలో ఉన్న దాటిని కంటే ఈ కంపెనీలు టారిఫ్ ను 600 రూపాయలు పెంచాయి. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 395 రోజుల కాలవ్యవధితో రోజుకు 2జీబీ డేటాతో 2,395 రూపాయల ప్లాన్ ను తీసుకు వచ్చింది. ప్రైవేట్ టెలికం ఆపరేటర్ల సంవత్సర ప్లాన్లతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ 30 రోజులు ఎక్కువ ఆఫర్ చేయడంతో పాటు, ప్లాన్ ధర 1204 రూపాయలు తక్కువగా పెట్టింది. దీంతో కొత్త కస్టమర్లు భారీ సంఖ్యలో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. బేస్ ప్లాన్ విషయంలోనూ ప్రైవేట్ సంస్థలు వినియోగదారులపై భారీగా బాదుడు ప్రారంభించాయి. 28 రోజుల కాలవ్యవధి ఉన్న బేస్ ప్లాన్ ధరను ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రూ.199, జియో రూ.189 చేశాయి. బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలవ్యవధితో ఈ ప్లాన్ రూ.108 కే అందిస్తోంది.