Budget 2026 : గోల్డ్ లోన్ తీసుకోవాలా? బడ్జెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి.

Update: 2026-01-16 06:15 GMT

Budget 2026 : భారతీయ కుటుంబాల్లో అత్యవసర ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టడం ఒక సాధారణ అలవాటు. అయితే, ప్రస్తుతం బ్యాంకుల కంటే ముత్తూట్, మణప్పురం వంటి ఎన్బీఎఫ్సీ‎ల వద్దే ఎక్కువ మంది రుణాలు తీసుకుంటున్నారు. ఈ కంపెనీలు బడ్జెట్‌లో తమకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం ఈ హోదా కేవలం బ్యాంకులకే ఉంది, దీనివల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకే నిధులు అందుతాయి. ఒకవేళ ఎన్బీఎఫ్సీలకు కూడా ఈ హోదా ఇస్తే, అవి సామాన్యులకు ఇచ్చే గోల్డ్ లోన్ల మీద వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న మరో పెద్ద మార్పు గోల్డ్ క్రెడిట్ లైన్. మనం రోజూ వాడే ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా నేరుగా గోల్డ్ లోన్ పొందే వెసులుబాటును తీసుకురావాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అంటే, మీ బంగారం తాకట్టు పెట్టిన తర్వాత, మీకు అవసరమైనప్పుడల్లా యూపీఐ ద్వారా ఆ లోన్ మొత్తాన్ని వాడుకోవచ్చు, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు తిరిగి కట్టేయవచ్చు. ఇది అమలైతే గ్రామాల్లోని ప్రజలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లి అధిక వడ్డీలు కట్టాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ పద్ధతిలో రుణం పొందడం చాలా సులభం అవుతుంది.

బంగారు రుణాల విషయంలో రిస్క్ చాలా తక్కువని, ఎందుకంటే లోన్ కంటే ఎక్కువ విలువైన బంగారం కంపెనీల దగ్గర ఉంటుందని ఎన్బీఎఫ్సీలు వాదిస్తున్నాయి. అందుకే తమకు ఉన్న పెట్టుబడి పరిమితులను పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ నిబంధనలను సడలిస్తే, మార్కెట్లో నగదు లభ్యత పెరుగుతుంది. ఫలితంగా కస్టమర్లకు తక్కువ డాక్యుమెంటేషన్ తో, అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తంలో రుణాలు లభించే అవకాశం ఉంటుంది.

గణాంకాల ప్రకారం భారత్‌లో గోల్డ్ లోన్ తీసుకునే వారిలో ఎక్కువ మంది 50 వేల రూపాయల కంటే తక్కువ రుణం తీసుకునే వారే. పిల్లల చదువులు, వ్యవసాయం లేదా చిన్న వ్యాపారాల కోసం ఈ డబ్బును వాడుతుంటారు. అందుకే నిర్మలమ్మ ఈ బడ్జెట్‌లో గోల్డ్ లోన్ కంపెనీలకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే, దాని ప్రయోజనం నేరుగా సామాన్యుడి జేబుకే అందుతుంది. కాబట్టి కొత్తగా లోన్ తీసుకోవాలనుకునే వారు బడ్జెట్ ప్రకటనల కోసం వేచి చూడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News