BUSINESS: కోటీ ఉద్యోగాలతో కొత్త సంవత్సరం
2026లో భారత ఉద్యోగ మార్కెట్ స్పష్టమైన మార్పు
గడచిన ఏడాదితో పోలిస్తే 2026లో కార్పొరేట్ సంస్థలు భారీగా నియామకాలకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది భారతీయ కంపెనీలు అదనంగా 1.2 కోట్ల వరకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రముఖ హెచ్ఆర్ సేవల సంస్థ టీమ్‌లీజ్ అంచనా వేసింది. గత ఏడాది ఈ సంఖ్య 80 లక్షల నుంచి కోటి మధ్యే ఉండటంతో, ఈసారి ఉపాధి రంగంలో స్పష్టమైన పాజిటివ్ మూడ్ కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవై, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డియాజియో, టాటా మోటార్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ నియామకాలపై దృష్టి పెంచాయి. కొత్త తరం యువతకు అవకాశాలు కల్పించడమే కాకుండా, సంస్థల్లో లింగ సమానత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మహిళల నియామకాలను అధికం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి.
ఈవై ఇండియా జూన్ 2026తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 14–15 వేల మందిని నియమించుకునే ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుతం 50 వేల మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ ప్రతి ఏటా ఇంజినీరింగ్, లా, మేనేజ్మెంట్ కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను తీసుకుంటోంది. ఉద్యోగులకు అంతర్జాతీయ అనుభవం కల్పించేలా గ్లోబల్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశాలను కూడా పెంచుతున్నట్లు సంస్థ తెలిపింది. డియాజియో ఇండియాలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సప్లై చైన్ ఆప్టిమైజేషన్ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. వినియోగదారుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో డేటా ఆధారిత నిర్ణయాలపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారిస్తోంది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ, హైడ్రోజన్ ఫ్యూయల్ వంటి భవిష్యత్ రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులను నియమించుకోవాలని నిర్ణయించింది.
ముఖ్యంగా స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోనూ నియామకాలు ఊపందుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2027 నాటికి మహిళలు, వికలాంగుల వాటాను 33 శాతంకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మోతీలాల్ ఓస్వాల్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఏఐ విభాగాల్లో కొత్త ఉద్యోగాలతో పాటు ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిపై కూడా దృష్టి పెట్టనుంది. రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులను సిద్ధం చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి, వినియోగ డిమాండ్ పెరుగుదల, ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయంతో 2026లో భారత ఉద్యోగ మార్కెట్ మరింత బలపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యువతకు ఇది అవకాశాల సంవత్సరం కానుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలు, వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడంపై కార్పొరేట్ సంస్థలు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి. లింగ సమానత్వం, ఇన్‌క్లూజివ్ వర్క్‌ప్లేస్‌లే భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు పునాది అవుతాయి. ఈ ధోరణి 2026లో మరింత బలపడనుంది.”
-కార్పొరేట్ పాలసీ నిపుణుడు
ఉద్యోగ సృష్టితో పాటు వేతన నిర్మాణాల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. పనితీరు ఆధారిత వేతనాలు, హైబ్రిడ్ వర్క్ మోడళ్లు, స్కిల్ ఆధారిత ప్రమోషన్లు పెరగనున్నాయి. మొత్తం మీద 2026 సంవత్సరం యువతకు ఉద్యోగ పరంగా కొత్త అవకాశాలు తెరచే సంవత్సరంగా మారనుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.