Car Price : కారు ఒకటే.. కంపెనీ ఒకటే.. మరి సిటీ సిటీకి ధర ఎందుకు మారుతుందో తెలుసా?

Update: 2026-03-13 09:15 GMT

Car Price : భారతదేశంలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేసే ప్రతి ఒక్కరినీ వేధించే ప్రశ్న ఒకటి ఉంటుంది.. కారు మోడల్ ఒక్కటే, కంపెనీ ఒక్కటే, మరి సిటీని బట్టి ధర ఎందుకు మారిపోతుంది? అని. ఆన్‌లైన్‌లో ఒక ధర చూసి షోరూమ్‌కి వెళ్తే అక్కడ మరో ధర వినిపిస్తుంది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనేవారు ఈ 'ధరల మాయాజాలం' చూసి తల పట్టుకుంటారు. కారు అసలు ధర (Ex-showroom) దేశమంతటా దాదాపు ఒకేలా ఉన్నా, మీ చేతికి వచ్చేసరికి (On-road) ఆ ధర ఎందుకు కొండెక్కి కూర్చుంటుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం.

కారు ధరను నిర్ణయించేటప్పుడు ప్రధానంగా రెండు రకాల ధరలు ఉంటాయి. మొదటిది ఎక్స్-షోరూమ్ ధర. ఇది కంపెనీ నిర్ణయించే కారు విలువ. రెండోది ఆన్-రోడ్ ధర. మీరు కారును రోడ్డు మీదకు తీసుకురావాలంటే చెల్లించాల్సిన చివరి మొత్తం ఇది. ఈ రెండింటికీ మధ్య ఉండే వ్యత్యాసమే అసలు కథ. ఎక్స్-షోరూమ్ ధరకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జీలు, కొన్ని సందర్భాల్లో టీసీఎస్ వంటి పన్నులు అన్నీ కలిపితేనే ఆన్-రోడ్ ధర అవుతుంది. ఈ అదనపు ఛార్జీలు రాష్ట్రానికో రకంగా ఉండటం వల్లే సిటీ సిటీకి ధరలు మారిపోతుంటాయి.

ధరల తేడాకు ప్రధాన విలన్ రోడ్ టాక్స్. మన దేశంలో రోడ్ టాక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. అందుకే ప్రతి రాష్ట్రం తన ఇష్టానుసారంగా పన్ను రేట్లను నిర్ణయిస్తుంది. కొన్ని రాష్ట్రాలు కారు ధరలో కొంత శాతం టాక్స్ వసూలు చేస్తే, మరికొన్ని రాష్ట్రాలు కారు ఇంజిన్ సామర్థ్యం లేదా ధరను బట్టి స్లాబ్ సిస్టమ్‌ను అమలు చేస్తాయి. ఉదాహరణకు, ఒకే కారుకు కర్ణాటక లేదా తెలంగాణలో ఉన్నంత రోడ్ టాక్స్ ఢిల్లీలో ఉండకపోవచ్చు. అందుకే బెంగళూరు లేదా హైదరాబాద్‌లో కారు కొనడం మిగతా నగరాల కంటే కాస్త ఖరీదుతో కూడుకున్న పని.

రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఆర్టీవో నిబంధనల ప్రకారం మారుతుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మున్సిపల్ ట్యాక్స్ లేదా గ్రీన్ ట్యాక్స్ వంటి అదనపు వసూళ్లు కూడా ఉంటాయి. వీటితో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మీరు ఉండే నగరాన్ని బట్టి (Zone-A, Zone-B) స్వల్పంగా మారుతుంది. మెట్రో నగరాల్లో ప్రమాదాల ముప్పు ఎక్కువని భావించి ఇన్సూరెన్స్ కంపెనీలు కాస్త ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయి. ఇవన్నీ కలిసి కారు తుది ధరను ప్రభావితం చేస్తాయి.

మనం నిత్యం చూసే హ్యుందాయ్ క్రెటా కారునే ఉదాహరణగా తీసుకుంటే ఈ తేడా ఇట్టే అర్థమవుతుంది. దీని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10.75 లక్షలు ఉంటుంది. కానీ ఆన్-రోడ్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీలో ఇది రూ.12.60 లక్షల వరకు ఉంటే, కోల్‌కతాలో రూ.12.79 లక్షలుగా ఉంది. అదే ఐటీ హబ్ బెంగళూరులో అయితే ఏకంగా రూ.13.36 లక్షలకు చేరుతుంది. ఇక మన హైదరాబాద్‌లో రూ.13.51 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒకే కారుపై నగరాల మధ్య దాదాపు లక్ష రూపాయల వరకు తేడా కనిపిస్తోంది.

చివరిగా, మీరు ఎంచుకునే ఇంధనం కూడా పన్నులపై ప్రభావం చూపుతుంది. ఢిల్లీ వంటి నగరాల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న పెట్రోల్ కార్లపై 10% రోడ్ టాక్స్ వేస్తే, డీజిల్ కార్లపై ఏకంగా 12.5% వసూలు చేస్తారు. కారు రంగును బట్టి కూడా కొన్ని కంపెనీలు అదనంగా వసూలు చేస్తుంటాయి. అందుకే కారు కొనడానికి ముందే మీ నగరంలోని ఆన్-రోడ్ ధరను సరిచూసుకోవడం, పక్క రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఆరా తీయడం చాలా ముఖ్యం.

Tags:    

Similar News