High-Mileage Bikes : మైలేజీలో టాప్.. స్టైల్లో సూపరో సూపర్.. 150-200ccలో బెస్ట్ బైకులు ఇవే.
High-Mileage Bikes : భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్ గా మారుతోంది. అదే క్రమంలో తాజాగా మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. 2025 ఏడాదిలో దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏకంగా 2 కోట్ల యూనిట్లను దాటేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 78 శాతం వృద్ధి కావడం విశేషం. ఒకప్పుడు భారతీయ బైక్ ప్రియులు కేవలం 'మైలేజీ'ని మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టైలిష్ లుక్, అదిరిపోయే టెక్నాలజీ, కంఫర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఎన్ని ఫీచర్లు ఉన్నా, పెట్రోల్ ధరల సెగ తగులుతున్న ఈ కాలంలో మైలేజీ అనే మాటకు ఉన్న క్రేజ్ తగ్గలేదు.
ముఖ్యంగా 150cc నుంచి 200cc విభాగంలో పవర్, మైలేజీని సమంగా ఆశించే వారి కోసం మార్కెట్లో కొన్ని టాప్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం పర్ఫార్మెన్స్‌కే కాదు, జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఈ 5 బైకులు బెస్ట్ ఆప్షన్లు. వీటిలో మొదటి స్థానంలో టీవీఎస్ అపాచీ RTR 160 నిలుస్తోంది. అపాచీలో చాలా వెర్షన్లు ఉన్నా, RTR 160 2V మోడల్ మైలేజీలో రికార్డు సృష్టిస్తోంది. ఇది లీటరుకు సుమారు 61 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. స్పోర్టీ లుక్ ఉండాలని కోరుకునే మధ్యతరగతి కుర్రాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఇక బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ NS160, పల్సర్ N160 బైకులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. పల్సర్ అంటేనే పవర్ అనుకుంటారు కానీ, ఇవి మైలేజీలోనూ తగ్గేదేలే అంటున్నాయి. NS160 మోడల్ సుమారు 52 కి.మీ మైలేజీ ఇస్తుండగా, సరికొత్త డిజైన్‌తో వచ్చిన N160 లీటరుకు 51 కి.మీ మైలేజీని అందిస్తోంది. సిటీ ట్రాఫిక్‌లో దూసుకెళ్లడానికి, హైవే రైడ్స్ ఎంజాయ్ చేయడానికి ఈ రెండు బైకులు కూడా చాలా నమ్మదగ్గవి.
స్టైల్, టెక్నాలజీలో రాజీ పడకూడదనుకునే వారి కోసం యమహా R15 V4 ఒక వరం. దీని రేసింగ్ లుక్ చూసి ఇది మైలేజీ ఇవ్వదేమో అనుకుంటే పొరపాటే. ఇందులో ఉన్న స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇది 50 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. చివరగా, దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై నమ్మకానికి మారుపేరుగా నిలిచిన హోండా యూనికార్న్ కూడా ఈ పోటీలో ఉంది. 162.7cc ఇంజిన్ ఉన్నప్పటికీ, ఇది లీటరుకు 50 కి.మీ వరకు మైలేజీ ఇస్తూ, డైలీ ఆఫీస్ ప్రయాణికులకు బెస్ట్ ఫ్రెండ్ లాంటి బైక్‌గా పేరు తెచ్చుకుంది.