Car Price Hike : కొత్త ఏడాదిలో ధరల షాక్..ఆ 5 కంపెనీల కార్లు కొనాలంటే జేబుకు చిల్లే!

Update: 2026-01-02 05:15 GMT

Car Price Hike : కొత్త ఏడాది (2026)లో కారు కొనాలనుకునే మధ్యతరగతి సామాన్యుడికి భారీ షాక్ తగిలింది. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు జనవరి 1, 2026 నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ముడిసరుకుల ధరలు పెరగడం, రవాణా ఖర్చులు భారం కావడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి.

ధరలు పెరగడానికి అసలు కారణం

కార్ల తయారీలో వాడే స్టీల్, అల్యూమినియం వంటి లోహాల ధరలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో కరెన్సీ హెచ్చుతగ్గులు, రవాణా ఖర్చులు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. 2025లో జీఎస్‌టీ తగ్గింపు వల్ల కస్టమర్లకు కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఇప్పుడు ధరల పెంపుతో ఆ ప్రయోజనం సగం తగ్గిపోనుంది.

ధరలు పెంచిన 5 ప్రముఖ కంపెనీలు ఇవే

1. హ్యుందాయ్ మోటార్ ఇండియా: హ్యుందాయ్ తన అన్ని మోడళ్లపై సగటున 0.6 శాతం ధరను పెంచింది. ఎంట్రీ లెవల్ గ్రాండ్ i10 నియోస్ నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అయానిక్-5 వరకు అన్నింటిపై ఈ ప్రభావం ఉంటుంది. ఇన్-పుట్ కాస్ట్ పెరగడం వల్ల కస్టమర్లపై ఈ స్వల్ప భారాన్ని వేయక తప్పలేదని కంపెనీ పేర్కొంది.

2. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్: ఎంజీ మోటార్ తన వాహనాలపై 2 శాతం వరకు ధరను పెంచింది. దీనివల్ల పాపులర్ ఎలక్ట్రిక్ కార్లైన విండ్సర్ ఈవీ ధర సుమారు రూ.35,000 వరకు, కామెట్ ఈవీ ధర రూ.20,000 వరకు పెరిగే అవకాశం ఉంది. హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ధరల మార్పుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

3. నిస్సాన్, రెనాల్ట్ : జపాన్ దిగ్గజం నిస్సాన్ ఏకంగా 3 శాతం వరకు ధరలను పెంచి గట్టి షాక్ ఇచ్చింది. మరోవైపు రెనాల్ట్ ఇండియా కూడా తన పాపులర్ మోడల్స్ అయిన క్విడ్, కైగర్, ట్రైబర్‌లపై 2 శాతం వరకు ధర పెంచుతున్నట్లు వెల్లడించింది.

4. లగ్జరీ కార్లు - మెర్సిడెస్, బీఎమ్‌డబ్ల్యూ: మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2 శాతం ధర పెంచడంతో, జీఎల్ఎస్ వంటి కార్ల ధరలు రూ.2.6 లక్షలకు పైగా పెరిగాయి. అలాగే బీఎమ్‌డబ్ల్యూ కూడా 3 శాతం మేర ధరలను పెంచింది. కరెన్సీ మారకం విలువలో మార్పులు వీరికి ప్రధాన సమస్యగా మారాయి.

మరి మారుతి, టాటా పరిస్థితి ఏంటి?

టాటా మోటార్స్ కూడా జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్లు సూచన ప్రాయంగా తెలిపింది. అయితే మారుతి సుజుకి మాత్రం చిన్న కార్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి జనవరి చివరి వరకు పాత ధరలనే కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News