CHEMICAL HUB: గ్లోబల్ కెమికల్ హబ్‌గా భారత్.!
దేశాభివృద్దిలో పరిశ్రమలు కీలక పాత్ర.. గ్లోబల్ కెమికల్ సెంటర్ లక్ష్యంగా భారత్;
ఒక్కో దేశ అభివృద్ధికి పునాది వేశేది పరిశ్రమలు. వాటిలో ముఖ్యమైనది "రసాయనాల పరిశ్రమ". ఇది ఒక దేశ ఆర్థిక వ్యూహంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వగలగడం, ఇతర పరిశ్రమల అవసరాలను తీర్చడం వంటి విశేషాలు దీనివల్ల సాధ్యమవుతాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ రంగాన్ని కొత్త ఎత్తుగడలతో ముందుకు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక చూస్తే, రాబోయే రోజుల్లో భారత్ గ్లోబల్ కెమికల్ సెంటర్‌గా ఎదగాలనే లక్ష్యాన్ని ఎంతో గంభీరంగా తీసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఎక్కడ దృష్టి పెట్టాలి?
ప్రస్తుతం భారతదేశం రసాయనాల ప్రపంచ వ్యాపార విలువ శృంఖలలో (GVC) కేవలం 3.5 శాతం వాటా కలిగి ఉంది. ఇది చాలా తక్కువ. 2040 నాటికి ఈ వాటాను కనీసం 6 శాతానికి, సంస్కరణలతో 12 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.
1. కెమికల్ హబ్స్ ఏర్పాటే మార్గం
రసాయనాల పరిశ్రమ కోసం ప్రత్యేకంగా కెమికల్ క్లస్టర్లు, హబ్స్ ఏర్పాటు చేయాలి. ఇవి కార్మికులు, మౌలిక వసతులు, నిబంధనల పరంగా ప్రత్యేకమైన వ్యూహంతో రూపొందాలి. నీతి ఆయోగ్ ప్రతిపాదన ప్రకారం, 8 పోర్ట్ ఆధారిత క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించడంతోపాటు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక ‘కెమికల్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
2. ముడి పదార్థాలపై అధిక దిగుమతులు
ప్రస్తుతం మనం ఎక్కువగా చైనా వంటి దేశాల నుంచి ఫీడ్‌స్టాక్‌లు (ముడి పదార్థాలు) దిగుమతి చేసుకుంటున్నాం. 2023 నాటికి 31 బిలియన్ డాలర్ల రసాయనాల వాణిజ్య లోటు ఉంది. అంటే మనం దిగుమతి చేసుకున్నవి ఎగుమతి చేసిన వాటికంటే చాలా ఎక్కువ.
3. పరిశోధన అభివృద్ధికి ప్రోత్సాహం అవసరం
ఇక మూడో సమస్య – మన పరిశ్రమల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) లేవనే స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా కంపెనీలు తమ ఆదాయంలో సగటున 2.3%ను R&D పై ఖర్చు చేస్తే, మన దేశంలో అది కేవలం 0.7%. మన దేశంలోనూ కొత్త నానో కెమికల్స్, బయో కెమికల్స్ వంటి అధునాతన రంగాల్లో పరిశోధన జరిగితేనే, నిజమైన మార్పు వస్తుంది. అందుకోసం ప్రభుత్వ ప్రోత్సాహం అత్యవసరం.
4. పర్యావరణ అనుమతులపై స్పష్టత, వేగం అవసరం
ఈ రంగానికి మళ్లీ మరొక పెద్ద ఆటంకం – పర్యావరణ అనుమతులు. ఒక్కో కంపెనీకి అవసరమైన అనుమతులు రావడానికి నెలల సేపు పడుతుంది. ఇదే ఆలస్యం పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని తగ్గిస్తోంది. ఈ ప్రక్రియను సులభతరం చేయాలని, పారదర్శకంగా చేయాలని నివేదిక సూచించింది. డీపీఐఐటీ ఆధ్వర్యంలో ఆడిట్ కమిటీ ద్వారా పరిశీలన జరగాలని పేర్కొంది.
5. నైపుణ్యాలున్న వృత్తి నిపుణుల కొరత
ఇంకొక ప్రధాన సమస్య, ఈ రంగంలో నైపుణ్యం ఉన్న కార్మికుల, సాంకేతిక నిపుణుల కొరత. ముఖ్యంగా గ్రీన్ కెమిస్ట్రీ, ప్రాసెస్ సేఫ్టీ, నానో టెక్నాలజీ లాంటి కొత్త విభాగాల్లో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలిసి విద్యా రంగాన్ని ఈ వైపు దృష్టి సారించేలా చేయాల్సి ఉంది. అందుకే ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఆలస్యం చేయకుండా, సత్వరమే అమలులోకి తేవాలి. ఇవన్నీ కలిసొస్తే భారత్ రసాయన రంగంలో గ్లోబల్ సూపర్ పవర్ గా నిలుస్తోంది.